గ్రూప్ ఎగ్జామ్స్: ఆ సెంటర్లో పరీక్ష రాసిన ఏడుగురు టాపర్లే
X
పదేళ్ల క్రితం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న వ్యాపమ్ తరహా కుంభకోణం దేశ రాజకీయాల్ని కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా అలాంటి కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. గ్రూప్-2, గ్రూప్-4 (పట్వారీ) పరీక్షల్లో ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి పరీక్ష రాసిన ఏడుగురు అభ్యర్థులు టాపర్లయ్యారు. దీంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ సెంటర్ బీజేపీ ఎమ్మెల్యేది కావడంతో మరింత వివాదాస్పదం అయింది. జూన్ 30న విడుదలైన గ్రూప్-2, గ్రూప్-4 (పట్వారీ) పరీక్షల రిజల్ట్స్ విడుదల చేశారు. మూు రోజుల తర్వాత టాప్ 10 జాబితాను విడుదల చేశారు. వాళ్లలో ఏడుగురు గ్వాలియర్ లోని ఎన్ఆర్ఐ కాలేజ్ సెంటర్ లో ఎగ్జామ్ రాసినట్లు గుర్తించారు.
ఆ కేంద్రం నుంచి 1700 మంది పరీక్ష రాయగా.. ఏడుగురు టాప్ 10లో నిలిచారు. ఈ ఏడుగురు ఆన్సర్ షీట్ లో హిందీలో సంతకం చేసి.. ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ లో రాసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఈ పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహించారని ఆరోపిస్తున్నారు. 2013లో జరిగిన పరీక్షల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు అభ్యర్థులు డబ్బులిచ్చి నాయకులు, అధికారులను కొని.. వ్యాపమ్ కు పాల్పడ్డారు. అప్పుడు ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.