వలసకూలికి రూ. కోటి.. కాపాడండి అంటూ పోలీసుల దగ్గరికి పరుగో పరుగు
X
ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ! నిరుపేదకు ఒక్కసారిగా సంపద కలిసొస్తే ఆ సంతోషం చెప్పక్కర్లేదు. అదే సమయంలో ఆ డబ్బును ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక పడే బాధలు వర్ణనాతీతం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వలసకూలి పరిస్థితి ఇలాగే తయారైంది. లాటరీలో కోటి రూపాయలు గెల్చుకున్న అతడు భద్రత కోరుతూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని జరిగిందీ సంఘటన.
బర్షు రాంబా అనే యువకుడు కేరళ ప్రభుత్వ నిర్వహివహించే 'ఫిఫ్టీ - ఫిఫ్టీ' లాటరీ టికెట్ కొన్నాడు. బుధవారం ఫలితాలు రాగా లాటరీ ఏజెంటు దగ్గరికి వెళ్లి ఆరా తీశాడు. అతని టికెట్‌కు కోటి రూపాయలు తగలగడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నిజమా కలా అని నంబర్లను మరోసారి చెక్ చేసుకున్నాడు. తనకే తగిలిందని ఊపిరి పీల్చుకున్నాక, మరో సమస్య ఎదురైంది. పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రానికి వచ్చిన రాంబాకు తలదాచుకోవడానికే సరైన చోటు లేదు. ఏకంగా కోటి రూపాయలు తన దగ్గరుంటే ఎవరైనా కొట్టో, చంపో ఎత్తుకుపోతారని భయపడ్డాడు. ఆ విషయంలో ఏజెంటుకు చెప్పగా, పోలీసుల సెక్యూరిటీ తీసుకో అని సూచించారు. రాంబా వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరిగిత్తి, ‘‘ముఝే బచావో పోలీస్ సాబ్’’ అని కోరాడు. లాటారీ సొమ్ము ఎలా తీసుకోవాలో తనకు తెలియదని, తన సొమ్ము తనకు భద్రంగా చేర్చాలని కోరాడు. లాటరీ టికెట్ తన దగ్గుంటే దొంగలు ఎత్తుకుపోతారని స్టేషన్‌లో ఉంచాడు. సమస్య పరిష్కారమయ్యేంతవరకు తమ దగ్గరే ఉండొచ్చని పోలీసులు భరోసా ఇచ్చారు.