డ్రైవర్ల ఆందోళనకు కారణమేంటి..? ఇంతకీ హిట్ అండ్ రన్ చట్టంలో ఏముంది..?
X
ఇండియన్ పీనల్ కోడ్.. ఐపీసీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత చట్టం తీసుకొచ్చింది. త్వరలోనే ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది. అయితే హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త చట్టంలో ఉన్న శిక్ష, జరిమానాపై ట్రక్ డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం జైలు శిక్ష, జరిమానా మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ సర్కారు వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఫలితంగా ట్రక్కులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇంధనం సరఫరా నిలిచిపోవడంతో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. డ్రైవర్లు ఆ చట్టాన్ని వ్యతిరేకించడానికి కారణమేంటి? ఇంతకీ హిట్ అండ్ రన్ చట్టంలో ఏముంది..?
భారతీయ న్యాయసంహిత ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో ట్రక్కు డ్రైవర్లకు భారీ శిక్ష పడనుంది. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాలకు కారణమైతే విధించే పెనాల్టీని భారీగా పెంచేశారు. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ దోషిగా తేలితే పదేండ్ల జైలు శిక్ష పడే ఛాన్సు ఉంది. దాంతో పాటు రూ.7 లక్షల వరకు జరిమానా విధించేలా కొత్త చట్టంలో మార్పు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐపీసీ సెక్షన్ ప్రకారం కేవలం హిట్ అండ్ రన్ కేసులో కేవలం రెండేళ్ల జైలుశిక్ష మాత్రమే ఉంది. కానీ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలకు కొత్త చట్టంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి ఘటన గురించి ఫిర్యాదు చేయకున్నా, పారిపోయినా ఆ శిక్షను పదేళ్లకు పెంచనున్నారు. దీంతో పాటు రూ. 7 లక్షల ఫైన్ విధిస్తారు.
ఇదిలా ఉంటే కొత్త చట్టంపై ట్రక్ డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రూరంగా ఉందని, భారీ వాహనాలకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. శిక్ష పెంపు, భారీ జరిమానా విధించడాన్ని తప్పుబడుతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇంకెవరూ డ్రైవింగ్ వృత్తి చేపట్టేందుకు ముందుకురానని అంటున్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని తాము హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేసినా జనం తమపై దాడి చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చట్టంలో మార్పు చేయాలంటూ ట్రక్, ప్రైవేట్ బస్సులు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.