Home > జాతీయం > మోడీ నోట కేసీఆర్ మాట.. ప్రధాని వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా..?

మోడీ నోట కేసీఆర్ మాట.. ప్రధాని వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా..?

మోడీ నోట కేసీఆర్ మాట.. ప్రధాని వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా..?
X

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ కూతురు కవితకు లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ కు ఓటేయాలన్న మోడీ.. మీ కుటుంబసభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయండని పిలుపునిచ్చారు. అయితే గతంలో తనపై సీఎం కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా మోడీ పట్టించుకోలేదు. తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలోనూ కేసీఆర్ను పల్లెత్తు మాట అనలేదు. అలాంటిది మధ్యప్రదేశ్లో ఆయనను టార్గెట్ మోడీ చేస్తూ విమర్శలు చేయడంపై జోరుగా చర్చ నడుస్తోంది.

భోపాల్ సభలో కేసీఆర్ మాట

భోపాల్లో నిర్వహించిన 5 రాష్ట్రాల బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ కేసీఆర్ కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిణామాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు కేంద్ర సహకరిస్తుందన్న విమర్శలు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న తరుణంలో మోడీ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే ప్రధాని భోపాల్లో కేసీఆర్ పేరు ప్రస్తావించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర నేతల అసంతృప్తి

కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిషన్ 90 నినాదంతో దూసుకెళ్లాలని భావించిన కమలదళం జోరుకు బ్రేక్ పడింది. ఒకవైపు క్యాడర్లో నైరాశ్యం.. మరోవైపు పార్టీలో నెలకొన్న వర్గపోరు బీజేపీ హైకమాండ్ను ఆలోచనలో పడేసింది. ఇతర పార్టీల వారు కొత్తగా పార్టీలో చేరకపోగా ఉన్న నాయకులు సైతం బీజేపీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న విషయం తెలిసి అప్రమత్తమైన బీజేపీ హైకమాండ్ వారిద్దరినీ హస్తినకు పిలిపించి చర్చలు జరిపింది. ఆ భేటీల్లో ఇద్దరు నాయకులు సైతం కేసీఆర్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశాలు వచ్చినా పార్టీ దాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదన్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. కేసీఆర్ విషయంలో పార్టీ వైఖరి ఇలాగే కొనసాగితే తమ దారి తాము చూసుకుంటామని ఈటల, రాజగోపాల్ బీజేపీ హైకమాండ్కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్..

మరోవైపు బయటకు ఉప్పు నిప్పులూ కనిపిస్తున్నా బీఆర్ఎస్ - బీజేపీలు ఒక్కటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే నెలలు గడుస్తున్నా అటు సీబీఐగానీ ఇటు ఈడీగానీ ఆమెను అరెస్ట్ చేయలేదు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినందునే కేంద్రం కవిత విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సందు దొరికినప్పుడల్లా ఈ విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తమకు ప్రత్యర్థే తప్ప మిత్రపక్షం కాదని చెప్పేందుకే ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ వేదికగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహారాష్ట్రపై కేసీఆర్ నజర్

బీఆర్ఎస్గా మార్చిన తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ కార్యకలాపాలను దేశమంతటా విస్తరిస్తామని చెప్పారు. అయితే ఒక్క మహారాష్ట్ర మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ హడావిడి కనిపించడం లేదు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించినా ఇప్పటి వరకు కేసీఆర్ అటు వైపు చూడలేదు. కానీ మహారాష్ట్రలో మాత్రం భారీ బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అక్కడి ప్రజలకు వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకున్న మోడీ, కేసీఆర్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్సీపీ, కాంగ్రెస్లకు చెక్..

మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం నడుపుతోంది. షిండే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగా.. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే శివసేనను చీల్చి గద్దెనెక్కిన షిండేపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది కాస్తా ఎన్సీపీ, కాంగ్రెస్లకు ప్లస్ కానుంది. ఇదే సమయంలో బీజేపీకి అది ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీకి లబ్ది చేకూరకుండా మోడీ వేసిన స్కెచ్లో భాగంగానే సీఎం కేసీఆర్ పేరును తెరపైకి తెచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

మోడీకి కేసీఆర్ భయం

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతల స్పందన మాత్రం మరోలా ఉంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని మోడీకి నిద్రపట్టడంలేదని అంటున్నారు. కేసీఆర్పై ఉన్న భయంతోనే మోడీ ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఆయన పేరు ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు.

reasons behind pm modi targeting cm kcr in bhopal

telangana,national,national news,madhya pradesh,bhopal,cm kcr,pm modi,narendra modi,congress,kavitha,bjp,etala rajender,komatireddy rajagopal reddy,assembly election,shivsena,eknath shinde,devendra fadnavis,ncp,brs

Updated : 27 Jun 2023 1:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top