Budget 2024 LIVE Updates: ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఇంతకీ మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి..?
X
(Budget 2024 LIVE Updates) బడ్జెట్.. సామాన్యులకు చాలా సుపరిచితమైన పదం. సగటు జీవి జమా ఖర్చుల లెక్కలను ఓ రిపోర్టుగా రాసుకుంటే అదే బడ్జెట్. ప్రభుత్వాలు చేసే పని కూడా అదే. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే రాబడి, వ్యయాలకు సంబంధించిన జమా లెక్కలనే వార్షిక బడ్జెట్ అంటారు. మరో వారం రోజుల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ సాధారణ బడ్జెట్ కు భిన్నంగా ఉంటుంది. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించదు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్.. ఫలితాలు వచ్చిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
సాధారణ బడ్జెట్లోలాగా మధ్యంతర బడ్జెట్లో అన్ని అంశాలు ఉండవు. రాబడి, వ్యయం అంచనాలు మాత్రమే ఉంటాయి. కొత్త హామీలు, విధాన ప్రకటనలు దాదాపు ఉండవు. మధ్యంతర బడ్జెట్ లో ప్రభుత్వం కేవలం కొన్ని నెలల జమాఖర్చులను మాత్రమే చూపుతుంది. ఈ మధ్యంతర బడ్జెట్నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటారు. దానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరి. ఓటాన్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. మధ్యంతర బడ్జెట్ కేవలం 2 నుంచి 4 నెలల కాలానికి మాత్రమే ఉంటుంది. ఓటాన్ అకౌంట్ పై చర్చలు ఏమీ ఉండవు. కేవలం పార్లమెంటు ఆమోదం మాత్రమే ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చిన ప్రభుత్వం మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అందులో కీలకమైన ప్రతిపాదనలు చేర్చే అవకాశముంటుంది. ట్యాక్సులు, కొత్త పథకాలకు సంబంధించి నిర్ణయాలు కూడా ఉంటాయి.