Home > జాతీయం > మోదీని ప్రశ్నించిందని విలేకరిపై ట్రోలింగ్.. వైట్‌‌హౌస్ రియాక్షన్ ఇది..

మోదీని ప్రశ్నించిందని విలేకరిపై ట్రోలింగ్.. వైట్‌‌హౌస్ రియాక్షన్ ఇది..

మోదీని ప్రశ్నించిందని విలేకరిపై ట్రోలింగ్.. వైట్‌‌హౌస్ రియాక్షన్ ఇది..
X

ఇండియాలో మైనార్టీ హక్కుల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించిన ది వాల్ స్ట్రీట్ జర్నల్‌ విలేకరిని ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేయడాన్ని వైట్‌హౌస్ మంగళవారం ఖండించింది. వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ల కోఆర్డినేటర్ జాన్ కిర్బీ... ఇలాంటి వేధింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమ సహోద్యోగి సబ్రినా సిద్దిఖీ (Sabrina Siddiqui) వేధింపులకు గురి చేస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. దీనిపై స్పందించిన జాన్ కిర్బీ.. "జర్నలిస్టులపై వేధింపులు ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధం" అని తెలిపారు.




ఇటీవల అమెరికా (US)లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ 23న శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్‌ మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాతంపై మీరేమంటారు.. ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని సబ్రీనా ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ.. ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని ప్రధాని చెప్పుకొచ్చారు. ‘ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు.

Updated : 27 Jun 2023 2:32 PM IST
Tags:    
Next Story
Share it
Top