Home > జాతీయం > రూ.19కే రూ.2లక్షల బీమా.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

రూ.19కే రూ.2లక్షల బీమా.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

రూ.19కే రూ.2లక్షల బీమా.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
X

మీ బ్యాంక్ అకౌంట్ లో రూ.19 ఉన్నాయా? అయితే ఒక్క క్లిక్తో రూ.2లక్షల ప్రమాద బీమా పొందొచ్చు. ఊహించని ప్రమాదం జరిగి చనిపోయినా లేక వైకల్యానికి గురైనా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఉపయోగపడుతుంది. దేశ పౌరుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎంఎస్బీవై ఒకటి. బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు. అతి తక్కువ ప్రీమియంతో రూ.2లక్షల పరిహారం పొందే బీమా దేశంలో ఇదే కావడం విశేషం.

మరణిస్తే రూ.2లక్షలు

2015 మే 9న కేంద్ర ప్ర‌భుత్వం అమల్లోకి తెచ్చిన 3 సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల్లో ఒకటి ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న. ప్ర‌జ‌లు అతి త‌క్కువ ప్రీమియంతో బీమా పొంద‌ేలా ఈ పథకాన్ని రూపొందించారు. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా క‌లిగిన వారంద‌రూ ఈ బీమా పొందే వీలు క‌ల్పించింది. ఈ బీమా చేసుకున్న‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే వారి కుటుంబాల‌కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకున్న బీమా సంస్థ‌లు చెల్లిస్తాయి. ఒక‌వేళ ప్ర‌మాదంలో పాక్షిక వైక‌ల్యానికి గురైతే బీమా చేసిన వ్య‌క్తికి ల‌క్ష రూపాయలు చెల్లిస్తారు.

ఎవ‌రెవరు అర్హులు?

18 నుంచీ 70 ఏండ్ల వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క‌రూ కూడా ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమాలో చేరేందుకు అర్హులు. అయితే వారికి దేశంలోని ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలి. ఒక‌వేళ సదరు వ్య‌క్తికి ఒక‌టి కన్నా ఎక్కువ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే కేవ‌లం ఒక బ్యాంకులో త‌న‌కున్న ఒక సేవింగ్స్ ఖాతా ద్వారా మాత్ర‌మే ఈ బీమా పథకంలో చేరొచ్చు. జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఎన్ఆర్ఐలు కూడా ఈ స్కీంలో చేరొచ్చు.

కాల ప‌రిమితి

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేవ‌లం ఏడాది కాల పరిమితి మాత్రమే ఉంటుంది. ఏటా జూన్ 1న బీమా ప్రారంభ‌మై మే 31తో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం బీమా ప్రీమియం సేవింగ్స్ ఖాతా నుంచీ బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ చేయించి ఈ బీమాను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏటా రూ. 19 సేవింగ్స్ అకౌంట్ నుంచి సదరు బ్యాంకు అగ్రిమెంట్ చేసుకున్న బీమా సంస్థ‌కు ఈ ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది. ఇందుకోసం ఖాతాదారులు ఏటా జూన్ 1వ తేదీన అకౌంట్లో రూ.19 తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

బీమా వ‌ల్ల క‌లిగే లాభ‌ం ఏంటంటే?

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో చేర‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి. బీమా చేసిన వ్య‌క్తి ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే వారి నామినీకి బ్యాంకు ద్వారా బీమా సంస్థ రూ. 2 ల‌క్ష‌లు చెల్లిస్తుంది. పాక్షికంగా వైక‌ల్యం బారిన పడితే బీమా చేసిన వ్యక్తికి ల‌క్ష రూపాయ‌లు అందిస్తారు. అయితే బీమా చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఈ స్కీం వర్తించదు. సదరు వ్యక్తి హత్యకు గురైతే ఈ పథకం వర్తిస్తుంది.

క్లెయిమ్ ఎలా చేసుకోవాలంటే

బీమా స్కీంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి సంబంధించిన అన్ని పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. రోడ్డు, రైలు ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురైతే ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్టు తదితర డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. పాము కాటుకు గురై మరణించినా లేదా చెట్టుపై నుంచీ కిందపడిపోయి చనిపోయినా హస్పిటల్ ఇచ్చే డాక్యుమెంట్లు పొందుపరచాలి. బీమా కంపెనీ వాటిని పరిశీలించిన అనంతరం పీఎంఎస్బీఐ పథకం కింద క్లెయిమ్ డబ్బులను నెల రోజుల్లోగా నామినీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది.





Updated : 16 Aug 2023 4:55 PM IST
Tags:    
Next Story
Share it
Top