Nitish Kumar : బీహార్ అసెంబ్లీలో ఎవరి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు
X
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీతో బంధం తెంచుకున్న సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ రోజు సాయంత్రం కల్ల కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాసన సభలో ఎవరికి ఎన్ని సీట్లున్నాయి అంటే..243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో సర్కార్ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. లాలు ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీకి 79 ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి 114మంది బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి, జేడియూలోని 45 మంది సభ్యులు మద్దతుతో వారి కూటమికి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేలా 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు దక్కించుకోగా సీపీఐ (ఎంఎల్) 12 చోట్ల, హిందుస్తానీ ఆవాం మోర్చా (సెక్యులర్) పార్టీ నాలుగు చోట్ల, సీపీఐ రెండు, సీపీఎం రెండు, ఎంఐఎం ఒక చోట గెలుపొందాయి. రాష్ట్రంలో ఒకే ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.రెండు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య మేజిక్ ఫిగర్ కన్నా ఒక సీటు ఎక్కువే ఉంది, దీనికి తోడు హిందుస్తానీ ఆవాం మోర్చా తమకు మద్దతిస్తోందని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకుంటే కూటమి బలం 127కు చేరుతుంది. దీంతో మరోమారు నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఢోకా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇప్పటికే తాము కూడా సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది.