Hardeep Singh Nijjar : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. ఇంతకీ ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్..
X
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయముందన్న కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ విషయంలో ట్రూడో చేసిన ఆరోపణలు భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సాకుతో భారత దౌత్యవేత్తను బహిష్కరించడాన్ని తప్పుబట్టింది. ఇంతకీ కెనడా అంతగా వెనకేసుకొస్తున్న ఆ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు? భారత ప్రభుత్వం అతన్ని మోస్ట్ వాంటెడ్గా ఎందుకు ప్రకటించింది.?
హర్దీప్ సింగ్ నిజ్జర్ పంజాబ్ జలంధర్ లోని భార్ సింగ్ పురాలో 1977లో జన్మించాడు. 1997లో ప్లంబర్గా పనిచేసేందుకు వర్క్ వీసాపై కెనడా వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యారు. అతనికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. కెనడాలో ప్లంబర్గా జీవితం ప్రారంభించిన హర్దీప్ ఆ తర్వాత ఖలిస్థానీ సానుభూతిపరుడిగా మారాడు. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. దీంతో పాటు వేర్పాటు వాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్లో కీలక సభ్యుడిగా మారాడు.
ఉగ్రావద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. పలు కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్దీప్ను 2000 సంవత్సరంలో ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో లుథియానాలో జరిగిన బాంబు బ్లాస్టుకు ఇతనే సూత్రధారి. ఆ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది గాయపడ్డారు. 2009లో పటియాలాలో రాష్ట్రీయ సిఖ్ సంఘటన్ ప్రెసిడెంట్ రుల్దా సింగ్ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు.
పంజాబ్ జలంధర్ లో ఓ హిందూ పూజరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. ఎన్ఐఏ మోస్ట్ వాటెంట్ గా ప్రకటించింది. అతనిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. కెనడా, యూకే, అమెరికాలో భారత దౌత్య కార్యాలయాలపై దాడుల్లో నిజ్జర్ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన రోజున గురుద్వారాలో స్పీచ్ ఇచ్చాడు. తనకు చావు తప్పదని ముందే గ్రహించిన ఆయన తాను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో ఇదే విషయం చెప్పాడు. చివరి ప్రసంగంలోనూ ఇదే తన చివరి రోజు కావచ్చన్న ఆయనను.. గురుద్వారా నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు యువకులు కాల్చి చంపారు.