Chandrayan-3: చంద్రయాన్-3: రాకెట్ ప్రయోగం శ్రీహరి కోట నుంచే ఎందుకు..?
X
ఇస్రో ఏ ప్రయోగం చేసినా.. మొదట గుర్తొచ్చే పేరు నెల్లూరులోని శ్రీహరి కోట స్పేస్ సెంటర్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు గుండెకాయలా సేవలందిస్తోంది. ఇస్రో చేసే ప్రయోగాలన్నీ దాదాపు ఇక్కడి నుంచే జరుగుతాయి. దేశంలో ఇన్ని సముద్ర తీర ప్రాంతాలున్నా.. ఇస్రో శ్రీహరి కోటకే ప్రాధాన్యం ఇస్తుంది. దేశ విదేశాలకు చెందిన ఎన్నో రాకెట్ ప్రయోగాలు ఇక్కడి నుంచే చేస్తుంటారు. అసలు రాకెట్ ప్రయోగాలు శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు..? అన్న ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే.. శ్రీహరి కోట స్పేస్ సెంటర్ కు ఐదు ప్రత్యేకతలున్నాయి.. అవేంటంటే..
భూమధ్య రేఖకు దగ్గరగా:
శ్రీహరి కోట స్పేస్ సెంటర్ భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే ఇస్రో సైంటిస్ట్ లను ఆకర్శించింది. ఇక్కడి నుంచి రాకెట్ పంపితే ఖర్చు తగ్గుతుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కారణంగా.. స్పేస్ స్టేషన్ నుంచి పైకి ఎగిరిన తర్వాత సెకన్ కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగాన్ని అందుకుంటుంది. భూభ్రమణం వల్ల రాకెట్ కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.
సుదీర్ఘ తీర ప్రాంతం:
శ్రీహరి కోట చుట్టూ నీరే ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు పులికాట్ సరస్సు ఉంటాయి. వాతావరణ, సాంకేతిక సమస్యల వల్ల రాకెట్ ఫెయిల్ అయినా దాని శకలాలు జనాలపై కాకుండా.. నేరుగా సముద్రంలోగాని, సరస్సులో గాని పడిపోతాయి. 43,360 ఎకరాల స్పెస్ సెంటర్ విస్తీర్ణం, సుమారు 50 కిలోమీటర్ల తీరప్రాంతం దీని ప్రత్యేకత.
ప్రయోగాలకు వాతావరణం అనుకూలం:
రాకెట్ ప్రయోగాలకు వాతావరణం కీలకం. కొంచెం అటు ఇటైనా ప్రయోగం ఫెయిల్ అవుతుంది. శ్రీహరి కోటలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎండలు, వర్షాలు అధికంగా ఉండవు. ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. ఒక్క అక్టోబర్, నవంబర్ లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి.
ధృడమైన భూభాగం:
శ్రీహరి కోట భూభాగం బండ రాళ్లతో చాలా ధృడంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగాలకు వాతావరణ ఎంత కీలకమో.. భూ స్వభావం కూడా అంతే కీలకం. రాకెట్ నింగిలోకి వెళ్తున్న టైంలో.. ఆ ప్రెజర్ కు భూమీ కంపిస్తుంది. దాన్ని తట్టుకునేందుకు భూమి ధృడంగా ఉండాలి. శ్రీహరి కోట అందుకు అనువుగా ఉంటుంది.
రవాణా వ్యవస్త:
గూడ్స్ ట్రాన్స్ పోర్ట్, యంత్రాల సరఫరాకు రవాణా వ్యవస్త కీలకం. శ్రీహరి కోటకు రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయాలున్నాయి. శ్రీహరి కోట నేషనల్ హైవే 5ను ఆనుకుని ఉంటుంది. చెన్నై పోర్ట్ 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ ఉండేది 20 కిలో మీటర్లే. అందుకే శ్రీహరి కోట ఇస్రోకు బెస్ట్ చాయిస్.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.