దమ్ముంటే మోదీపై పోటీ చేయండి.. దీదీకి బీజేపీ సవాల్..
X
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీ చేయాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు. ప్రధాని కావాలనుకుంటున్న మమతా వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయరని ప్రశ్నించారు. దమ్ముంటే మమతా తన సవాల్ను స్వీకరించాలన్నారు. వారణాసిలో మోదీపై ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదించారన్న ప్రచారంపై అగ్నిమిత్ర ఈ విధంగా స్పందించారు. ప్రియాంకాగాంధీ స్థానంలో మమతా పోటీ చేయాలని సవాల్ విసిరారు.
వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో అజయ్ రాయ్ పోటీ చేశారు. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మోదీపై ప్రియాంకను నిలబెట్టాలని దీదీ ప్రతిపాదించారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆమె పోటీ అంశం చర్చనీయాంశమైంది. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని సంజయ్ రౌత్ అన్నారు.