వేరు కాపురం పెడదామంటూ భార్య పోరు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
X
సరైన కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పాశ్చాత్య దేశాల్లో జరిగినట్టుగా భారత్‌లో పెండ్లికాగానే..కుమారుడు తన తల్లిదండ్రుల్ని విడిచి వేరుగా రావటం జరగదని పేర్కొన్నది. మేజర్ కాగానే లేదా పెండ్లికాగానే.. తల్లిదండ్రుల్ని వదిలేయటం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరని ధర్మాసనం అభిప్రాయపడింది.
జస్టిస్ సురేశ్ కుమార్ కైట్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరు కాపురం కోసం తనను వేధించిన భార్య నుంచి విడాకులు కోరుతూ సదరు వ్యక్తి వేసిన పిటిషన్ కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. తన పట్టుదలే నెగ్గాలనే వైఖరితో గత 16 ఏళ్లుగా ( 2007 నుంచి) పుట్టింటిలో ఉంటున్న భార్య నుంచి అతడికి విడాకులను మంజూరు చేయడమే కాక, ఆ వివాహాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. వేరు కాపురానికి నో చెప్పిన భర్తతో తాను కూడా ఇక కలిసి జీవించలేనని ఆ భార్య కోర్టుకు తెలిపింది.
దీంతో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ‘ఒక వ్యక్తి తన కుటుంబంలో భార్యకు ఎంత గౌరవం ఇస్తాడో.. అంతే గౌరవాన్ని తల్లిదండ్రులకు, ఇతర తోబుట్టువులకు కూడా ఇస్తాడు. అలాంటి తల్లిదండ్రులను వయసుపైబడిన దశలో వదిలేసి.. భార్యతో కలిసి వెళ్లిపోవడం న్యాయం కూడా కాదు. అది హిందూ పరంపరకు కూడా విరుద్ధం. వేరు కాపురానికి వెళ్లడానికి సరైన కారణం ఏదైనా ఉండాలి’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల విషయంలో కుమారుడికి నైతికంగా, చట్టపరంగా కొన్ని బాధ్యతలుంటాయని, వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.