Pinarayi Vijayan: గవర్నర్‌కు భద్రత పెంచిన కేంద్రం.. సీఎం షాకింగ్ కామెంట్స్
X
నడిరోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammed Khan)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మండిపడ్డారు. రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదాలో ఉన్న వ్యక్తి.. ఇలా ప్రవర్తించడం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తనపై దాడి చేశారన్న ఆరోపణలతో ప్రభుత్వాన్ని విమర్శించడం, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం.. రాజ్యాంగాన్ని అమమానించేనట్టేనన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులపై నిరసనలు సహజమేనని.. అలాంటి సమయంలో ప్రతిస్పందించే ముందు తన స్థాయిని గుర్తుపెట్టుకోవాలని గవర్నర్‌కు సీఎం సూచించారు. గత కొంతకాలంగా గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు.. తాజా వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
ఢిల్లీ పయనమయ్యేందుకు శనివారం తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా.. తన వాహనంపై కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రే సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలతో భౌతికంగా తనపై దాడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాకు తెలిపారు. తనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆరిఫ్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. దీంతో గవర్నర్ ప్రవర్తనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు.
‘‘ప్రస్తుతం కేరళలో సీఆర్‌పీఎఫ్ పాలన కొనసాగుతోందా?ఈ సాయుధ దళాలు కేసు నమోదు చేస్తాయా? రాష్ట్రంలో ఆ దళాలను మోహరించడం విచిత్రంగా ఉంది. పోలీసులు పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదని గవర్నర్ ఆరోపించారు. మరి ఇప్పుడు ఆయన కోరుకున్న విధంగా సీఆర్‌పీఎఫ్ వ్యవహరిస్తుందా?’’ అని సీఎం ప్రశ్నించారు. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆరిఫ్.. కేరళ పోలీసులపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం వారు కల్పించే భద్రత ఆయనకు సరిపోదా అని విమర్శించారు. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ భద్రతను కేంద్ర హోంశాఖ పెంచిన విషయం తెలిసిందే. ఆయనకు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేరళ రాజ్‌భవన్ వెల్లడించింది.