Home > జాతీయం > దమ్ముంటే ఆ డాక్యుమెంట్లు చూపండి.. ఈడీకి హేమంత్ సోరెన్ సవాల్..

దమ్ముంటే ఆ డాక్యుమెంట్లు చూపండి.. ఈడీకి హేమంత్ సోరెన్ సవాల్..

దమ్ముంటే ఆ డాక్యుమెంట్లు చూపండి.. ఈడీకి హేమంత్ సోరెన్ సవాల్..
X

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అరెస్టు వెనుక రాజ్ భవన్ హస్తం ఉందని హేమంత్ సోరెన్ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసిన జనవరి 31 దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని హేమంత్ సోరెన్ అభిప్రాయపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సోరెన్ విమర్శించారు. తన పట్ల ఎంత దారుణంగా వ్యవహరించినా ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చనని తన టైం వచ్చే వరకు వాటిని ఆపుకుంటానని అన్నారు. ఆదివాసీల కన్నీరు బీజేపీకి పట్టదని మండిపడ్డారు. 8.5ఎకరాల భూ కుంభకోణంలో తన పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. ఈడీ అధికారులకు దమ్ముంటే తన పేరుపై ఆ భూమి రిజిస్టరై ఉన్నట్లు డాక్యుమెంట్లు చూపాలని సవాల్ విసిరారు. ఒకవేళ వారు ఆధారాలు చూపితే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ల్యాండ్ స్కాంలో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు రాంచీలోని PMLA కోర్టు బలనిరూపణకు హాజరయ్యేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన చంపై సోరెన్ ప్రభుత్వ బలనిరూపణకు ఆయన గట్టి బందోబస్తు మధ్య హాజరయ్యారు. చంపై సోరెన్ ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించారు. జార్ఖండ్లో జేఎంఎం - కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 41 కాగా.. జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 16, ఆర్జేడీ, సీపీఐఎంల్ లకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక ప్రతిపక్షంలోని బీజేపీకి 25మంది సభ్యులుండగా.. ఏజేఎస్యూకు 3,ఎన్సీపీ 1,ఇతరులు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన 47 మంది మద్దతున్న జేఎంఎం - కాంగ్రెస్ కూటమి బలనిరూపణలో సునాయాసంగా గెలవనుంది.

Updated : 5 Feb 2024 1:32 PM IST
Tags:    
Next Story
Share it
Top