Home > జాతీయం > ఒడిశా రైలు ప్రమాదం.. శవాలు కూడా జడుసుకునేలా ‘భార్య’ మోసం

ఒడిశా రైలు ప్రమాదం.. శవాలు కూడా జడుసుకునేలా ‘భార్య’ మోసం

ఒడిశా రైలు ప్రమాదం.. శవాలు కూడా జడుసుకునేలా ‘భార్య’ మోసం
X

ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తే.. మరి కొంతమందికి దురాశను తెప్పిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారమే ఈ దురాశకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాజేయడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. మార్చూరీలో ఉండే మృతదేహాల వద్దకు వచ్చి అవి తమవారివేనంటూ కట్టుకథలు అల్లుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే జరగ్గా.. అధికారులు ముందే గుర్తించారు.

ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల మృతదేహాలను భద్రపరిచిన బాలాసోర్‌లోని తాత్కాలిక మార్చూరీ వద్దకు 40ఏళ్ల మహిళ వచ్చింది. తన పేరు గీతాంజలి దత్తా అని, తాను కటక్‌ నుంచి వచ్చానని అక్కడి అధికారులకు చెప్పింది. జూన్ 2న ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో తన భర్త ప్రయాణించాడని, అతడి ఆచూకీ తెలియడంలేదని అధికారులకు వివరించింది. దీంతో అధికారులకు ఆమెకు కొన్ని ఫోటోలను చూపించగా..ఆమె ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ.. అతడే తన భర్త అని చెప్పింది.

గీతాంజలి అలా చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేకపోవడంతో పాటు ఆమె ప్రవర్తనా తీరుపై అనుమానం రావడంతో అధికారులు తమదైన శైలిలో విచారించారు. కటక్‌లో ఆమె ఎక్కడ ఉంటారో చిరునామా అడిగి తెలుసుకొని అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. కటక్‌ జిల్లాలోని బారంబాలో ఆమె భర్త బతికే ఉన్నారని అక్కడి పోలీసులు తేల్చారు. అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం తాను అలా చేసినట్లు సదరు మహిళ అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను గట్టిగా మందలించి వదిలేశారు.

కటక్‌ వెళ్లిన తర్వాత సదరు గీతాంజలికి మరో చేదు అనుభవం ఎదురైంది. ఆమె భర్త బిజయ్ దత్తా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘తాను చనిపోయినట్లు చిత్రీకరించి, ప్రజాధనాన్ని కాజేసేందుకు ప్రయత్నించింది. మోసపూరిత చర్యకు పాల్పడిన నా భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అతడు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు చేసిన విషయం తెలిసుకుని ఆమె పరారైంది. కాగా బిజయ్, గీతాంజలి గత 13 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించగా.. రైల్వే శాఖ 10లక్షల పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.

Updated : 7 Jun 2023 9:03 PM IST
Tags:    
Next Story
Share it
Top