డబ్బుపై ఆశ.. నలుగురిని పెళ్లి చేసుకున్న కి"లేడీ"..
X
అందంతో వల వేస్తుంది. మాటలతో ఆకట్టుకుంటుంది. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు గడిచాక ఉన్నకాడికి ఊడ్చేసి పత్తా లేకుండా పోతుంది. ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. మూడో భర్త తీగ లాగడంతో ఆమె డొంక కదిలింది. నాలుగు పెళ్ళిళ్ల భాగోతం బయటపడటంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది.
కర్నాటకలోని మండ్య జిల్లా పాండవపురకు చెందిన స్నేహ అలియాస్ నిర్మల అనే యువతికి డబ్బు అంటే అంతులేని ఆశ. రెండేళ్ల క్రితం రైలులో వెళ్తున్న సమయంలో ఆమెకు ప్రశాంత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. 2022 ఫిబ్రవరిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దావణగెరెలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. రెండు నెలల క్రితం గర్భం దాల్చాలని చెప్పిన స్నేహ పుట్టింటికి వెళ్లింది. అయితే రోజులు గడిచినా భార్య తిరిగిరాకపోవడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో భర్త ప్రశాంత్ ఆమె చెప్పిన అడ్రస్కు వెళ్లాడు. కానీ అది ఫేక్ అడ్రస్ అని తెలిసి అవాక్కయ్యాడు.
ఇటీవల సోషల్ మీడియాలో స్నేహ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ప్రశాంత్ దిమ్మదిరిగింది. ఆమె రఘు అనే యువకున్ని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ప్రశాంత్ దావణగెరె కేటీజే ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్నేహ ప్రశాంత్ ను పెళ్లాడక ముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. ఆమె కుటుంబసభ్యులు తొలుత మేలుకోటె ప్రాంతానికి చెందిన మహేశ్‌తో వివాహం చేశారు. అయితే కొన్నాళ్లకే అతన్ని విడిచి పెట్టిన ఆమె బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని కూడా వదిలేసి.. దావణగెరెకు చెందిన ప్రశాంత్‌కు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంది. తాజాగా బెంగళూరుకు చెందిన రఘు అనే యువకున్ని నాల్గో వివాహం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు స్నేహను అరెస్టు చేశారు.