శివలింగానికి కరెన్సీ నోట్లతో అభిషేకం.. మహిళపై జనాల ఆగ్రహం..
X
ప్రముఖ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడిలో శివలింగంపై ఓ మహిళ కరెన్సీ నోట్లను చల్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. గర్భగుడిలో ఫోన్‌కు అనుమతించి..వీడియో తీయడంపై దుమారం రేగుతోంది.
శివలింగానికి పక్కనే కుడివైపున నిలబడిన ఆ మహిళ.. కేదారేశ్వరుడిపై నోట్లు విసరడం వీడియోలో కనబడుతోంది. గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధం ఉన్నా..ఆమెను ఎవరూ వారించలేదు. దీంతో ప్రముఖ దేవాలయంలో ఆమె ప్రవర్తనను తప్పు బడుతున్నారు. దేవాలయ సిబ్బంది, నిర్వహణ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఆ మహిళ ఎవరన్నది ఇంతవరకు తెలియరాలేదు.