Home > జాతీయం > అసెంబ్లీకి కత్తితో వచ్చిన మహిళ.. కర్ణాటకలో కలకలం

అసెంబ్లీకి కత్తితో వచ్చిన మహిళ.. కర్ణాటకలో కలకలం

అసెంబ్లీకి కత్తితో వచ్చిన మహిళ.. కర్ణాటకలో కలకలం
X

కర్ణాటక అసెంబ్లీలోకి ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. మహిళను అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. తూర్పు ద్వారం గుండా ఆ మహిళ లోపలికి వస్తుండగా.. అక్కడున్న సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్‌ మెషిన్‌లోకి పంపగా అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు సిగ్నల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది. అయితే, కత్తితో అసెంబ్లీకి వచ్చిన మహిళ ఆసెంబ్లీ మహిళా ఉద్యోగి అని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై పోలీసులు వివరాలు ఏమీ తెలపలేదు. మహిళను విచారణ అనంతరం ఆమె ఎవరు.. కత్తితో అసెంబ్లీకి ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలిసే అవకాశముంది.

కర్ణాటక అసెంబ్లీలో గత వారం బడ్జెట్ సమావేశాల సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీలోకి ప్రవేశించి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడు. జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యే కరియమ్మ కూర్చోవాల్సిన సీటులో గుర్తు తెలియని వ్యక్తి కూర్చున్నాడు. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో మార్షల్స్‌ అతడిని బయటకు తీసుకెళ్లారు. సదరు వ్యక్తిని 70 ఏళ్ల తిప్పే రుద్రప్పగా గుర్తించి అరెస్ట్ చేశారు. విజిటర్స్‌ పాస్‌ సంపాదించిన రుద్రప్ప.. తాను ఎమ్మెల్యేనని చెప్పి లోపలకు ప్రవేశించగా.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్‌ .. లోపలకి అనుమతించడంతో ఈ ఘటన జరిగింది.

దీంతో అసెంబ్లీలో భద్రతను పటిష్టం చేశారు. ప్రతీ ఒక్కరికి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు తనిఖీలు చేపట్టగా బ్యాగులో కత్తితో వచ్చిన మహిళను అడ్డుకున్నారు అక్కడున్న సిబ్బంది. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated : 10 July 2023 9:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top