46 ఏండ్ల కిందట చెట్లు నరికినందుకు.. ఇప్పుడు అరెస్ట్
X
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయని తెలుగులో ఓ పాత సామెత. ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా సరిగ్గా అలాంటిదే. ఇక్కడ దొంగలెవరు, కుక్కలెవరు అని పోలీకలెంచకుండా విషయం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. రాజస్థాన్ లో 46 ఏండ్ల కిందట ఓ నేరం(పోలీసులు తెలిపిన ప్రకారం) జరిగిందట. 12 మంది మహిళలు కలసి ఆ క్రైమ్ చేశారట. ఇంతకీ.. వారు చేసిన ఆ నేరమేంటో తెలుసా.. కట్టెల కోసం చెట్లు నరకటం. అవును.. ఇంట్లో వంట చేయడానికి కట్టెల అవసరమై వారు 46 ఏళ్ల క్రితం అడవిలోని చెట్లని నరకడంతో పోలీసులు వారిని తాజాగా అరెస్టు చేశారు. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్లోని దిల్వారా, బూందీ జిల్లాలకు చెందిన 12 మంది మహిళలు 1977లో కట్టెల కోసం అడవిలోని చెట్లను నరికారు. ఇది ఓ అటవీశాఖ ఉద్యోగి కంటపడింది. దీంతె వెంటనే అతను అటవీ హక్కుల చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ఆ మహిళలపై బూందీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తమమీద కేసు నమోదైన విషయం ఆ మహిళలకు తెలియదు. పోలీసులు కూడా ఈ కేసును ఆ తర్వాత మర్చిపోయారు. ఇటీవల పెండింగ్‌లో ఉన్న పాత కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ కేసు బయటికి వచ్చింది.
అలా 46 ఏళ్ల క్రితం నమోదైన కేసులో బిల్వారా, బూందీ జిల్లాలలో ఉంటున్న ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు మహిళలు ఇప్పటికే మరణించినట్లుగా గుర్తించారు. ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలియదు. తమ మీద కేసు నమోదు అయిందని.. అదికూడా 46 ఏళ్ల క్రితం అని తెలిసిన మహిళలు విస్తుపోయారు. అదుపులోకి తీసుకున్న వారిని జుమ్మా దేవీ(70), మోతియన్ బాయి(75), టీకాద్(72), లాలీ బాయి(75), బాచి బాయి(70), పుష్ప(75)గా గుర్తించి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. మహిళల వయసును పరిగణలోకి తీసుకుని కేసును కొట్టివేసింది. జరిమానా మాత్రమే విధించింది.