Home > జాతీయం > Women's reservation bill: మీకు తెలుసా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిది కాదు..!!

Women's reservation bill: మీకు తెలుసా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిది కాదు..!!

Womens reservation bill: మీకు తెలుసా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిది కాదు..!!
X

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం చారిత్రక ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును.. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాబోయే సమావేశాల్లో తొలి బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లునే ప్రవేశపెట్టనున్నారు.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును మొదటగా 1996, సెప్టెంబర్ 12 న హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు సభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 12వ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, అప్పుడు కూడా బిల్లుకు తగిన మద్దతు లభించలేదు. దీంతో లాప్ అయ్యింది. ఇదే వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ అప్పుడూ బిల్లు పాస్‌ కాలేదు.

దాదాపు ఐదేళ్ల తర్వాత, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ-1 ప్రభుత్వం.. మే 6, 2008న రాజ్యసభలో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది. మే 9, 2008న బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. ఈ నివేదికకు 2010, ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర లభించింది. 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దకావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మోదీ సారథ్యంలోని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే... లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదిస్తుంది. 33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది




Updated : 19 Sept 2023 7:23 AM IST
Tags:    
Next Story
Share it
Top