Women reservation bill: ఈ నెల 20న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు...?
X
మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బిల్లును పార్లమెంట్లో పెట్టాలని విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు మరికొన్ని తీర్మానాలను కేంద్రం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
మహిళా రిజర్వేషన్ బిల్లును చివరిసారిగా 2010 మే 9న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అప్పుడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా.. లోక్సభలో ఆమోదం లభించలేదు. అప్పట్లో ఈ బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్ మద్ధతు పలికినా.. సమాజ్ వాది పార్టీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు వ్యతిరేకించాయి. పట్టణ ప్రాంత మహిళలకే ఈ బిల్లుతో లబ్ది చేకూరుతుందని.. గ్రామీణ ప్రాంత మహిళల ఎలాంటి ప్రయోజనం లేదని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుతో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు రిజర్వ్ చేయబడుతుంది. ఈ రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపును పార్లమెంటు నియమించిన అథారిటీ నిర్ణయించాల్సి ఉంటుంది. లోక్‌సభ, శాసనసభలలో మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో మూడింట ఒక వంతు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మహిళలకూ రిజర్వ్ చేస్తారు. రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ నియోజకవర్గాల్లో రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు జరుగుతుందని ఈ బిల్లులో ఉంది. ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేస్తామని కూడా ఇందులో ఉంది. ఇక ఈ సారైనా బిల్లుకు ఆమోదం లభిస్తుందేమో చూడాలి.