Home > జాతీయం > కేంద్ర మంత్రితో భేటీ.. రెజ్లర్ల 5 డిమాండ్లు..

కేంద్ర మంత్రితో భేటీ.. రెజ్లర్ల 5 డిమాండ్లు..

కేంద్ర మంత్రితో భేటీ.. రెజ్లర్ల 5 డిమాండ్లు..
X

కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ భేటీ అయ్యారు. రెజ్లర్ల సమస్యపై చర్చించేందుకు సిద్ధమంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేయడంతో బజరంగ్ పునియా, సాక్షిలు ఆయనతో సమావేశమయ్యారు. గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రెజ్లర్లు కేంద్రమంత్రి ముందు 5 డిమాండ్లు ఉంచినట్లు సమాచారం.

డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవిని మహిళకు అప్పగించాలని రెజ్లర్లు తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి. బ్రిజ్‌ భూషణ్‌ సహా ఆయన కుటుంబసభ్యులు రెజ్లింగ్‌ ఫెడరేషన్లో భాగం కాకూడదు. రెజ్లింగ్‌ ఫెడరేషన్లో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాలక మండలికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. ఏప్రిల్‌ 28న జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి’’ అని రెజ్లర్లు డిమాండ్ చేశారు.

ఇక రెజ్లర్ల డిమాండ్లపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. ఇక సమావేశానికి వెళ్లే ముందు ముందు మీడియాతో మాట్లాడిన సాక్షి మాలిక్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూష‌ణ్కు వ్య‌తిరేకంగా చేపట్టిన నిర‌స‌న‌ను విర‌మించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌తిపాద‌న‌తో ముందుకొస్తుందో ప‌రిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని సాక్షి స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంతో రెజ్లర్ల సమావేశంపై స్పందించేందుకు బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ సింగ్ నిరాకరించారు.

Updated : 7 Jun 2023 5:27 PM IST
Tags:    
Next Story
Share it
Top