Home > జాతీయం > రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్కు రెగ్యులర్ బెయిల్

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్కు రెగ్యులర్ బెయిల్

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్కు రెగ్యులర్ బెయిల్
X

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు న్యాయస్థానం బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా ఇవాళ షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. బ్రిజ్ భూషణ్తో పాటు ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ సింగ్ కు సైతం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున పూచీకత్తుపై వారిని విడుదల చేయాలని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది.

బెయిల్ ఇచ్చేందుకు కోర్టు పలు షరతులు విధించింది. నిందితుడు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ ఫిర్యాదుదారులు, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఈ షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. బ్రిజ్ భూషణ్ కు బెయిల్ ఇవ్వడాన్ని రెజ్లర్ల తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితుడు పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడని ఆయన బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి బ్రిజ్ భూషణ్ కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ గా ఉన్న బ్రిజ్ భూషణ్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు మహిళా మల్లయోధులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు దిగారు. మరోవైపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. వారి పిటిషన్ పై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణఅ పై జూన్‌ 2న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనపై ఆరు కేసులు నమోదు కాగా 108 మందిని విచారించారు.

Updated : 20 July 2023 5:27 PM IST
Tags:    
Next Story
Share it
Top