ఢిల్లీ లిక్కర్ స్కాం.. అప్రూవర్గా వైసీపీ ఎంపీ..
X
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కొడుకు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్గా మారారు. ఇప్పుడు కొడుకుతో పాటు తండ్రి కూడా అప్రూవర్గా మారి ఈడీకి కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో అధికంగా సౌత్ గ్రూపుకు చెందిన వారే ఉండటం గమనార్హం.
ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి సైతం అప్రూవర్‌గా మారారు. ప్రస్తుతం వీరంతా బెయిల్‌పై ఉన్నారు. సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వీరు ఇప్పుడు అప్రూవర్లుగా మారడం ఆసక్తి రేపుతోంది. అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో ఈడీ పలువురిని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది..ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు..? కీలకంగా వ్యవహరించింది ఎవరు..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ మరోసారి ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు గోప్యంగా సాగుతోంది.