Home > జాతీయం > Nimisha Priya : కేరళ నర్సుకు నిరాశ.. మరణ శిక్ష అప్పీలు కొట్టేసిన యెమెన్ కోర్టు

Nimisha Priya : కేరళ నర్సుకు నిరాశ.. మరణ శిక్ష అప్పీలు కొట్టేసిన యెమెన్ కోర్టు

Nimisha Priya : కేరళ నర్సుకు నిరాశ.. మరణ శిక్ష అప్పీలు కొట్టేసిన యెమెన్ కోర్టు
X

యెమెన్‌లో మరణశిక్ష పడ్డ భారతీయ నర్సుకు నిరాశ ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు తన పాస్ పోర్ట్ తిరిగి పొందేందుకు తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు విచారణలో తేలింది. దీంతో న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిష ప్రియ యెమెన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోంది.

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం యెమెన్‌ వెళ్లింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్‌కు తిరిగి రాగా.. ఆమె మాత్రం ఉద్యోగ రీత్యా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 2015లో యెమెన్‌ దేశస్థుడైన తలాల్‌ మహ్దీ సాయంతో అక్కడే ఓ క్లినిక్‌ ప్రారంభించింది. అయితే, కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు రావడంతో మహ్దీ, నిమిష ప్రియ పాస్‌పోర్ట్‌ లాగేసుకున్నాడు.

మహ్దీ నుంచి ఎలాగైనా పాస్‌పోర్ట్‌ను తీసుకుని స్వదేశానికి తిరిగి రావాలనుకున్న ప్రియ.. 2017 జులైలో అతనికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చింది. అయితే, అది కాస్తా ఓవర్‌డోస్‌ అవడంతో మహ్దీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె.. మరో వ్యక్తితో కలిసి డెడ్ బాడీని మాయం చేసింది. 4 రోజుల తర్వాత నేరం బయటపడటంతో యెమెన్ పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. కేసు విచారణ పూర్తి చేసిన యెమెన్‌ కోర్టు.. ప్రియకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇదిలా ఉంటే అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి అరబ్ దేశంలో భారతీయ పౌరుల ఎంట్రీపై నిషేధం కొనసాగుతోంది. దీంతో నిమిష ప్రియ తల్లి యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహ్దీ కుటుంబంతో పరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పింది. తాజాగా ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ప్రియ తల్లిని యెమెన్‌ పంపించే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది




Updated : 17 Nov 2023 3:00 PM IST
Tags:    
Next Story
Share it
Top