విరోచనాలు తగ్గాలని 'యూట్యూబ్' చూసి ఏం చేశాడో తెలుసా..
X
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చాలామంది యూట్యూబ్ వీడియోలు చూస్తూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇటీవల కేరళలో ఓ వ్యక్తి యూట్యూబ్ చూసి భార్యకు నార్మల్ డెలివరీ చేయబోయి ఆమె ప్రాణాలను తీశాడు. తాజాగా ఓ ఝార్ఖండ్ కు చెందిన యువకుడు కూడా అలాంటి వీడియోలు చూసే తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. తనకు వచ్చిన అనారోగ్యాన్ని నయం చేసుకునే క్రమంలో యూట్యూబ్‌లో సూచించిన విధంగా 10 కర్పూరం బిళ్లలు మింగాడు. ఆ తర్వాత వైద్యం వికటించి ఆరోగ్యం విషమించింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లాతేహార్ జిల్లాలో.. బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామంలో నివసిస్తోన్న అవధేశ్ కుమార్ సాహుకు డయేరియా వచ్చింది. ఆస్పత్రికి వెళితే చాలా ఖర్చు అవుతుందని భావించాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో డయోరియా తగ్గేందుకు చిట్కాల కోసం వెతికాడు. కర్పూరం తింటే విరేచనాలు ఆగిపోతాయని ఓ వీడియో ద్వారా తెలుసుకున్నాడు. అందులో పేర్కొన్నట్లుగా 10 కర్పూరం మాత్రలను మింగాడు. విరోచనాలు తగ్గడం ఏమో కానీ.. అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ఆరా తీయగా తాను విరేచనాలు తగ్గడానికి కర్పూరం మాత్రలు మింగినట్లు చెప్పాడు అవధేశ్.
దీంతో అతడిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై డాక్టర్ అమర్ నాథ్ మాట్లాడారు. యువకుడికి విరేచనాలు అయ్యాయని.. అతడు యూట్యూబ్ ద్వారా సొంత చికిత్సను ప్రయత్నించాడని చెప్పారు. అయితే కర్పూరం ప్రభావం ఇంకా ఉందని.. అందుకే ఆ యువకుడు కనీసం రెండు మూడు రోజులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని తెలిపారు.