కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అరెస్ట్.. శంషాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
కేంద్ర మంత్రితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా..?
X
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి తో పాటు పలువురు బిజెపి నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను ముందుస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఉదయం 9.30గం.లకు ఢిల్లీ నుంచి శంషాబాద్ కు చేరుకుని.. బాట సింగారం వెళ్తున్న కిషన్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో.. ఆయన పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను నిలదీశారు. ‘చంపేస్తే.. చంపేయండి..’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా..? అంటూ అసహనం వ్యక్తం చేశారాయన.
కిషన్ రెడ్డి.. తన కాన్వాయ్ తో చలో బాటసింగారం బయల్దేరగా.. ఆయనను శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. దీంతో కిషన్ రెడ్డి కారులోనుంచి దిగి రోడ్డు మీద బైఠాయించారు. నేను ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని.. కచ్చితంగా బాట సింగారం పోతానంటూ కిషన్ రెడ్డి అన్నారు. ఆయనను బలవంతంగా పోలీసులు ఆయన కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.. కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఉదయం నుంచి పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ‘కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోండి.. జైళ్లకు వెళ్లడానికి మేము సిద్ధం’.. అన్నారు. ‘కల్వకుంట్ల ఎమర్జెన్సీలో ఉన్నామా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తిరిగి వెళ్ల డానికి నిరాకరించడంతో ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నేనేమైనా ఉగ్రవాదినా, ఎక్కడికి వెళ్లడానికైనా నాకు హక్కు ఉంది.. అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. . ఛలో బాట సింగారానికి పిలుపునిస్తే ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్‌లు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆంధ్రా పాలకులు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.