నడ్డా సభకు ఈటల, కోమటిరెడ్డి డుమ్మా
వర్కవుట్ అవ్వని అమిత్ షా భేటి!!
X
శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల భేటీ పెద్ద ఫలితాన్ని ఇవ్వనట్టు తెలుస్తోంది. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేయగా.. అందుకు అమిత్ షా నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదట. దీంతో ఇద్దరూ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న నాగర్‌కర్నూల్ సభకు ఇద్దరూ గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో పార్టీ మారడంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు.
నడ్డా సభకు హాజరుకాకపోవడంతో వీరితోపాటు మరికొందరు నేతలు కూడా బీజేపీని వదిలి వెళ్లిపోవడం ఖాయమంటున్నారు కొందరు. జితేందర్‌రెడ్డి, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి వంటి బీజేపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌లోకి క్యూ కడతారని ప్రచారం సాగుతున్నది. తగిన సమయం చూసుకొని బండి సంజయ్‌కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌తోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం నడ్డా సభకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో లుకలుకలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి సాక్షిగా బయటపడ్డాయని అంటున్నారు.