Home > రాజకీయం > ఏ తప్పు చేయలేదు.. ఆరోపణలు నిరూపిస్తే ఊరేసుకుంటా - బ్రిజ్ భూషణ్

ఏ తప్పు చేయలేదు.. ఆరోపణలు నిరూపిస్తే ఊరేసుకుంటా - బ్రిజ్ భూషణ్

ఏ తప్పు చేయలేదు.. ఆరోపణలు నిరూపిస్తే ఊరేసుకుంటా - బ్రిజ్ భూషణ్
X

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ మరోసారి సంచలన ప్రకటన చేశారుప. రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ఉరేసుకుంటానని తేల్చిచెప్పారు. వారి వద్ద ఆధారాలు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలని కోర్టు ఏ శిక్ష వేసినా దానికి సిద్ధమని ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్న ఢిల్లీ పోలీసుల ప్రకటన వెలువడిన కాసేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెస్టు చేయాలని కొన్ని రోజులుగా రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో ఛార్జ్ షీట్ లేక ఫైనల్ రిపోర్ట్ ను కోర్టులో సమర్పిస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పోక్సో సెక్షన్ల కింద ఏడేండ్ల కన్నా తక్కువ శిక్ష పడుతుంది. అందుకే నిందితున్ని అరెస్ట్ చేయలేదని అన్నారు. మరోవైపు బ్రజ్ భూషణ్ సాక్ష్యులను ప్రభావితం చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలో వారు మార్చ్ నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మంగళవారం గంగా నదిలో తమ పతకాలు కలిపేస్తామని వారు ప్రకటించారు. అయితే రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ మధ్యవర్తిత్వంతో వెనక్కు తగ్గారు. ఐదు రోజుల్లోగా బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా జూన్‌ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.




Updated : 31 May 2023 4:00 PM IST
Tags:    
Next Story
Share it
Top