ఆ హరిని నేను కాదు.. జబర్దస్త్ హరిత అలియాస్ హరికృష్ణ..
X
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జబర్దస్త్లో లేడీ గెటప్ వేసే కమెడియన్ హరిత అలీయాస్ హరికృష్ణ. రెండ్రోజుల క్రితం హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదైందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై హరికృష్ణ స్పందించాడు. నేరానికి పాల్పడింది ఒకరైతే తన ఫోటో ప్రసారం చేసి తనను నిందితున్ని చేశారంటూ జబర్దస్త్ హరిత అలియాస్ హరికృష్ణ వాపోతున్నాడు.
రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ శివార్లలో స్కార్పియో, వేగనార్ కార్లలో కొందరు ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులను చూసి ఒక డ్రైవర్ వాహనంతో తప్పించుకుని పారిపోగా.. మరో డ్రైవర్ తిరుపతి కిషోర్ పట్టుబడ్డాడు. విచారణలో అతని నుంచి సమాచారం రాబట్టిన పోలీసులు జబర్దస్త్ కమెడియన్ హరి స్మగ్లింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు బజర్దస్త్ హరి పేరును మీడియాకు చెప్పారు. కాణిపాకం పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయిందని, ప్రస్తుతం హరి పరారీలో ఉన్నాడని ప్రకటించారు. అయితే స్మగ్లింగ్ కేసు నమోదైంది హరిబాబుపై అయితే మీడియాలో మాత్రం లేడీ గెటప్ లు వేస్తున్న హరికృష్ణ ఫోటోలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.
మీడియాతో పాటు సోషల్ మీడియాలోజబర్దస్త్ కమెడియన్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు కనిపించడంతో పోలీసులు పట్టుకున్నది తనను కాదని, గతంలో షకలక శంకర్ టీంలో పనిచేసిన హరిబాబునని హరికృష్ణ క్లారిటీ ఇచ్చారు. తనను నిందితుడిగా చూపిస్తుండటంతో తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతోందని హరి వాపోయాడు. స్మగ్లింగ్ కేసులో తనను నిందితుడిగా చూపడం ఇదే ఫస్ట్ టైం కాదని, గతంలో రెండుసార్లు ఇలాగే తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పాడు. ఏడేళ్ల కింద ఒకసారి, లాక్ డౌన్ కు ముందు ఒకసారి తనపై ఇలానే వార్తలు రాశారని, ఇప్పుడు మూడో సారి తన ఫోటోలను పెట్టి దోషిగా చూపిస్తున్నారని బాధపడ్డాడు. ఇప్పుడైనా నిజం తెలుసుకుని తనను వదిలేయాలని వేడుకున్నాడు.