Home > జాతీయం > మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకంగా ఓటేసిన ఒవైసీ, మరో ఎంఐఎం ఎంపీ

మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకంగా ఓటేసిన ఒవైసీ, మరో ఎంఐఎం ఎంపీ

మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకంగా ఓటేసిన ఒవైసీ, మరో ఎంఐఎం ఎంపీ
X

ఆధునిక భారతదేశ చరిత్రలో ఈరోజు.. సెప్టెంబర్ 20.. మైలురాయిగా నిలిచిపోనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దాదాపు 8 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మంగళవారం దీన్ని సభలో ప్రవేశపెట్టారు. బుధవారం ఓటింగ్ నిర్వహించగా 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. కేవలం ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీకే చెందిన మహారాష్ట్ర ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ముస్లిం మహిళలకు కోటా కల్పించని ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ఒవైసీ మంగళవారమే చెప్పారు.

బిల్లు ఆమోదానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండడంతో మాన్యువల్ విధానంలో ఓటింగ్ జరిపారు. ఎరుపు, ఆకు పచ్చ రంగు స్లిప్పులతో ఓటింగ్ జరిపారు. బిల్లుకు మద్దతు తెలిపేవారు ఆకుపచ్చ చీటీపై ‘ఎస్‌’ రాయాలని, వ్యతిరేకించే వారు ఎర్ర చీటీపై ‘నో’ అని రాయాలని సభ సెక్రటరీ జనరల్ సూచించాక ఓటింగ్ జరిగింది. అంతకుముందు చర్చలో 60 మంది ఎంపీలు మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని, బిల్లులో మార్పులు ఉండొచ్చని చెప్పారు. వైఎస్సార్ ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బిల్లులో ఓబీసీ కోటా పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారని తెలిపారు. కోటాను 15 ఏళ్ల వరకే అని పరిమితం చేయొద్దని, మహిళలకు సాంకేతికంగా కాకుండా నిజమైన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

Updated : 20 Sep 2023 3:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top