Tushar Arothe : టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఇంట్లో నోట్ల కట్టలు..అంతా బెట్టింగ్ డబ్బే!
X
టీమిండియా మహిళల క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ తుషార్ అరొథె భారీ నగదుతో పట్టుబడ్డాడు. శనివారం ప్రతాప్ గంజ్ లోని ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అవి దాదాపు రూ. కోటి వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా తుషార్ ను అరెస్ట్ చేసిన వడోదర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు జరిపిన సోదాల్లో తుషార్ ఇంట్లో రూ.కోటి ఉన్న బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ ఎక్కడిది? అని పోలీసులు ప్రశ్నించగా తుషార్ తడబడ్డాడు. ఆ డబ్బంతా తనదేనని నిరూపించుకునేందుకు తుషార్ సరైన ఆధారాలు చూపలేకపోయాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తుషార్ కుమారుడు రిషిపై గతంలో క్రికెట్ బెట్టింగ్, చీటింగ్ కేసులు ఉన్నాయి.
దీంతో ఆ రూ.కోటి బెట్టింగ్ కు సంబంధించిన డబ్బే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బరోడాకు చెందిన తుషార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాణించాడు. కోచ్ గా విజయవంతమయ్యాడు. తుషార్ శిక్షణలో భారత మహిళల జట్టు.. 2017లో వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. దీంతో అతని కాంట్రాక్ట్ ముగిసినా.. బీసీసీఐ మరో రెండేళ్లు పొడగించింది. 2018 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి తాను బాధ్యత వహిస్తూ.. పదవికి రాజీనామా చేశాడు. అయినా తుషార్ కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా 2022 వరకు కొనసాగాడు.