బుమ్రాను కెప్టెన్సీ నుంచి తీసేయండి..మాజీ క్రికెటర్ సలహా
X
ఐర్లాండ్ సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. బుమ్రా నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా మెదటి టీ20లో రెండు పరుగల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటించారు.
11 నెలల తర్వాత పునరాగమం చేసిన బుమ్రా ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొదటి బంతికే ఫోర్ ఇచ్చిన అతడు...తర్వాత బంతికే వికెట్ తీశాడు. మొత్తం ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను దెబ్బకొట్టాడు. కెప్టెన్‌గా కూడా బుమ్రా తనకు తాను నిరూపించుకున్నాడు. దీంతో బుమ్రాపై ప్రసంసలు వస్తున్నాయి. రీ ఎంట్రీ తర్వాత మొదటి మ్యాచ్‌తోనే ఫామ్ లోకి రావడంపై మాజీలు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయం తర్వాత బుమ్రాను భవిష్యత్ పూర్తికాల కెప్టెన్ చేయాలని కిరణ్ మోరే వంటి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ మాత్రం బుమ్రాను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సూచించాడు. బుమ్రా తన బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, స్టార్ పేసర్‌పై ఎక్కువ భారం మోపడం జట్టుకు మంచిది కాదని నాయర్ తెలిపాడు. . గతంలో ఇంగ్లండ్ తో టెస్టులో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన సందర్భంలో బుమ్రాకు పని భారం ఎక్కువైందన్నాడు. అతని వెన్ను గాయం తిరిగబెట్టడానికి అది కూడా ఓ కారణం కావొచ్చని నాయర్ అభిప్రాయపడ్డాడు. భారత్ జట్టుకు అతని నాయకత్వ నైపుణ్యం కంటే ఫాస్ట్ బౌలర్ అవసరం ఎక్కువ నాయర్ స్పష్టం చేశాడు.