ICC World Cup 2023: వీళ్లంతా ఆఖరి వరల్డ్కప్ ఆడేశారా?
X
ఎన్నో ఆశలతో మొదలుపెట్టి, ఘనంగా ప్రారంభించిన వరల్డ్ కప్.. చివరికి నిరాశతో ముగిసిపోయింది. టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన మన ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ లో బోల్తాపడ్డారు. ఒత్తిడి, పరిస్థితులకు తలొగ్గి మ్యాచ్ ను ఓడిపోయారు. ఇక మరో వరల్డ్ కప్ కోసం ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే. కాగా కొంతమంది ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్ అయిందనే చెప్పాలి. నిన్నటి ఫైనల్ మ్యాచ్ తో వాళ్ల చివరి వరల్డ్ కప్ ఆడేశారనే చెప్పాలి. 2027లో జరిగే వరల్డ్ కప్ లో వీరు ఆడే అవకాశం దాదాపు లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ కు ప్రస్తుతం 36 ఏళ్లు. ఇప్పటికే అతను ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతుంటాడు. అలాంటిది 2027 వరల్డ్ కప్ కు అతనికి 40 ఏళ్ల వస్తాయి.
ఆ వయసులో క్రికెట్ ఆడటం కష్టమే. ఎందుకంటే దాదాపు క్రికెటర్లంతా 40 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటిస్తుంటారు. రోహిత్ శర్మతో పాటు మహమ్మద్ షమీ (33), రవిచంద్రన్ అశ్విన్ (37) కూడా వరల్డ్ కప్ కు గుడ్ బై చెప్పినట్లు. ఎందుకంటే 2027నాటికి షమీకి 38 ఏళ్లు, అశ్విన్ కు 40 ఏళ్లు దాటేసి ఉంటాయి. ప్రస్తుతం నెంబర్ 1 బౌలర్లుగా జోరుమీదున్న జస్ప్రిత్ బుమ్రా (29), మహమ్మద్ సిరాజ్ (29) కూడా వచ్చే వరల్డ్ కప్ ఆడటం కష్టమే. 2027 నాటికి వీరికి 37 ఏళ్లు నిండుతాయి. ఆ ఏజ్ లో ఫాస్ట్ బౌలర్లు జట్టులో కొనసాగడం అంటే కష్టమనే చెప్పాలి. ఇక రవింద్ర జడేజా (34)కు కూడా ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. ఇక పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (35)కి నెక్స్ట్ వరల్డ్ కప్ నాటికి 39 ఏళ్లు నిండుతాయి. అయితే ఫిట్ నెస్ పరంగా చూసుకుంటే కోహ్లీ ఆటలో కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత ఆటగాళ్లే కాకుండా.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని జట్టులో చేరిన ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ (32), అనుకోకుండా అవకాశం దక్కించుకున్న శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ (36)లకు కూడా ఇదే చివరి వరల్డ్ కప్. 38 ఏళ్ల మహమ్మద్ నబి (ఆఫ్ఘనిస్థాన్), ఆస్ట్రేలియా జట్టులో 37 ఏళ్ల వార్నర్, 34 ఏళ్ల స్మిత్, మ్యాక్స్‌వెల్ (35), స్టాయినిస్ (34), స్టార్క్ (33 ), న్యూజిలాండ్ జట్టులో 33 ఏళ్ల కేన్ విలియమ్సన్, 34 ఏళ్ల బౌల్ట్, సౌథీ (34), బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకిబుల్ హసన్ (36), ముష్ఫికర్ రహీం (36), ఇంగ్లాండ్ ఆటగాళ్లు డేవిడ్ మలన్ (36), మొయిన్ అలీ (36), క్రిస్‌వోక్స్ (34), ఆదిల్ రషీద్ (35), సౌతాఫ్రికా ప్లేయర్లు బవుమా (33), మిల్లర్ (34), వాండర్ డసన్ (34) తదితర ప్రస్తుత మేటి ఆటగాళ్లందరికీ ఇదే చివరి ప్రపంచకప్ అనడంలో సందేహం లేదు.