ICC World Cup 2023: వరల్డ్కప్లోనూ.. ఆఫ్ఘనిస్తాన్కు చేదు అనుభవం
X
ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇదివరకటిలా చిన్నచూపు చూసే రోజులు పోయాయి. పెద్ద టీంలకు సైతం చమటలు పట్టించే స్టార్ ప్లేయర్లు ఆ జట్టు సొంతం. ఇదివరకు ఆఫ్ఘాన్ తో మ్యాచ్ అంటే చిన్నచూపు చూసే మేటి జట్లు.. ఇప్పుడు ఆ టీంకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. వారిని ఎలా బోల్తా కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రియాల్టీలోకి వచ్చేసరికి మాత్రం మళ్లీ పాతకతే రిపీట్ అవుతుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడమా.. సరైన కోచ్, అనుభవం ఉన్న కెప్టెన్ లోపమో తెలియదు కానీ.. రాణిస్తుంది అనుకున్న ప్రతీసారి నిరాశ పరుస్తుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్.. బంగ్లాదేశ్ ముందు బొక్కబోర్లా పడింది. చిత్తుగా ఓడిపోయింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. 38 ఓవర్లలోనే ఆఫ్ఘాన్ ను కట్టడి చేసింది. 156 పరుగులు చేసిన ఆఫ్ఘన్ 37.2 ఓవర్లలో కుప్పకూలింది. ఓపెనర్లు గుర్బాజ్ 47, ఇబ్రహిమ్ 22 శుభారంభం అందించినా.. మిడిల్, లోయర్ ఆర్డర్లు విఫలం అవడంతో ఆఫ్ఘన్ తక్కువ స్కోర్ కే పరిమితం అయింది. రహ్మత్ 18, ఫాహిది 18, అజ్మతుల్లా 22 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లు కేవలం ఒక డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. షకిబ్, మెహది హసన్ 3 వికెట్లు తీయగా.. షరీఫుల్ ఇస్లాం 2, తస్కిన్, ముస్తఫిజుర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మెహదీ హసన్ 57, నజ్ముల్ షాంటో 59 హాఫ్ సెంచరీలతో రాణించడంతో బంగ్లా ఈజీగా లక్ష్యాన్ని చేదించింది. ఫజల్హక్ ఫరూకి, నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా తలా ఓ వికెట్ తీసుకున్నారు.