Home > క్రీడలు > వ్యూహాత్మకంగానే.. ఆసీస్ మళ్లీ మోసం చేసింది: అశ్విన్

వ్యూహాత్మకంగానే.. ఆసీస్ మళ్లీ మోసం చేసింది: అశ్విన్

వ్యూహాత్మకంగానే.. ఆసీస్ మళ్లీ మోసం చేసింది: అశ్విన్
X

కోట్ల మంది కల చెదిరిపోయి.. ఫైనల్ లో టీమిండియా ఓడిపోయి.. దాదాపు వారం రోజులైంది. అయినా.. ఆ బాధ ఇంకా తీరనే లేదు. ప్రతీ ఒక్కరినీ వెంటాడుతూనే ఉంది. ఓటమిని యాక్సెప్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా.. రోజుకొకరు చొప్పున కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఓటమిని గుర్తుచేస్తున్నారు. తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత ఓటమికి గల కారణాన్ని, టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకోవడంలో ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. దాన్ని బట్టి చూస్తే ఆసీస్ ఫైనల్ పై ఎంత స్టడీ చేసింది, ఎంత లోతుగా ఆలోచించి వ్యూహాలు రచించిందో అర్థం అవుతుంది. అహ్మదాబాద్ వేదికపై జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దాని వెనుకున్న కారణమేంటో అశ్విన్ బయటపెట్టాడు. మ్యాచ్ మధ్యలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీని ఇదే విషయాన్ని అడిగితే.. విస్తుపోయే సమాధానం చెప్పాడని అశ్విన్ తెలిపాడు.

‘‘వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ అమలు పరిచిన వ్యూహాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టును నడిపించిన తీరు అద్భుతంగా అనిపించింది. నలుగురు నుంచి ఐదుగురు ఫీల్డర్లను ఆఫ్ సైడ్ పెట్టి.. పరుగులు రాకూండా కట్టడి చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ కు పునాదులైయ్యే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లను వ్యూహాత్మకంగా ఔట్ చేశారు. ఇక ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం నన్ను వ్యక్తిగతంగా మోసం చేసింది. ఎందుకంటే.. మ్యాచ్ మధ్యలో నేను జార్జ్‌ బెయిలీని కలిసి.. బౌలింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటని అడిగా. దానికి అతను నా మైండ్ బ్లాక్ అయ్యే సమాధానమిచ్చాడు. ‘మేం ఈ వేదికపై ఐపీఎల్‌ మ్యాచ్ లు, ద్వైపాక్షిక సిరీస్‌లు చాలానే ఆడాం. పిచ్ కండీషన్స్, మట్టి తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఎర్రమట్టితో చేసిన పిచ్ అయితే మ్యాచ్‌ జరుగుతున్నంతసేపూ పగుళ్లు వస్తాయి. అదే నల్ల మట్టితో చేసిన పిచ్‌ అలా ఉండదు. పగుళ్లు రావు. తేమ పడుతున్న కొద్దీ కాంక్రీట్‌లా గట్టిగా మారుతుంది. బ్యాటింగ్ ఈజీగా చేయొచ్చ’ని అతనిచ్చిన ఆన్సర్ నన్ను విస్తుపోయేలా చేసింది’’ అని అశ్విన్‌ చెప్పాడు.


Updated : 24 Nov 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top