ఒక్క దెబ్బతో.. హర్భజన్ సింగ్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
X
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. తనకు సవాల్ విసిరిన వాళ్లందరికీ సమాధానం ఇచ్చాడు. జట్టులో తను ఎంత అవసరమో మరొకసారి నిరూపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో బెంచ్ కే పరిమితం అయిన అశ్విన్.. ఈ సిరీస్ లో కసితీర్చుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అశ్విన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. టాలెంట్ ఉన్న వాళ్లను పక్కనబెట్టొద్దని నిరూపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ద్వారా అశ్విన్ పలు రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ తో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును (707 వికెట్లు) అశ్విన్ (708 వికెట్లు) బ్రేక్ చేశాడు. దీంతో అన్ని ఫార్మట్ లలో కలిపి భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. మొదటి స్థానంలో అనిల్ కుంబ్లే (953 వికెట్లు) ఉన్నాడు. అంతేకాకుండా.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డును కూడా అశ్విన్ బద్దలు కొట్టాడు. షేన్ వార్న్ 5 వికెట్ల హాల్ ను 22 సార్లు తీయగా.. అశ్విన్ 23 సార్లు సాధించారు. అంతేకాకుండా టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్ల హాల్ ను అనిల్ కుంబ్లే 8 సార్లు తీయగా.. ఆ రికార్డు అశ్విన్ సమం చేశాడు.