యాషెస్ సిరీస్..రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఓటమి
X
యాషెస్ సిరీస్ మజానే వేరు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య సాగే ప్రతి మ్యాచ్ ఉత్కంఠకు దారి తీస్తోంది. విజయం కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అనూహ్య విజయం అందుకున్న కంగారులు...లార్డ్స్ టెస్ట్‌లోను ఇంగ్లాండ్‌ను బోల్తా కొట్టించారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఫస్ట్ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోనట్టు రెండో టెస్ట్ సాగింది. ఇంగ్లాండ్‌కెప్టెన్ స్టోక్స్ (155) భారీ సెంచరీతో పోరాడినా ఫలితంల లేకుండా పోయింది.
371 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ శనివారం ఆటముగిసే సమయానికి 114/4తో నిలిచింది. ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఆదివారం ఆటను ప్రారంభించింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో స్వల్ప వ్యవధిలోనే బెన్ డుకెట్, బెయిర్‌స్టో పెవిలియన్‌కు చేరారు. దీంతో 193 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. కానీ కెప్టెన్ స్టోక్స్ అనూహ్యంగా విజయం కోసం పోరాడాడు. స్టువర్ట్ బ్రాడ్(34 బంతుల్లో 11) సహకారంతో జట్టును ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే సెంచరీ, ఆపై 150 మార్క్‌ను స్టోక్స్ అందుకోవడంతో ఇంగ్లాండ్ విజయంపై కన్నేసింది. కానీ 155 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ ఔట్ కావడం మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఇంగ్లండ్ టెయిలండర్లు అద్భుతాలు చేయకపోవడంతో ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించించింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 325 పరుగులు చేసింది. 91 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 279 పరుగులు చేసి 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, ఇంగ్లాండ్ 81.3 ఓవర్లు ఆడి కేవలం 327 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది.