ban vs afg test:చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్...
X
అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా 21వ శతాబ్ధంలో అత్యధిక పరుగుల విజయం సాధించిన జట్టుకు బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 675 పరుగుల తేడాతో (1928లో) విజయం సాధించి అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్‌పై ఆసీస్ 562 పరుగుల తేడాతో (1934లో) గెలుపొంది రెండో స్థానంలో ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 382 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షాంటో (146) సెంచరీతో చెలరేగాడు. మహ్మదుల్లా హసన్ జాయ్ 76 పరుగులతో రాణించగా, ముష్ఫీకర్ రహీమ్ 47, మెహిదీ హసన్ 48 రన్స్‌తో పర్వాలేదనిపించారు. ఆఫ్గాన్ బౌలర్లలో నిజత్ మసూద్ 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్గాన్ 146 పరుగులకే కుప్పకూలింది. అప్సర్ జాజయ్ (36) టాప్ స్కోరర్.
తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 425/4 స్కోర్‌కు డిక్లేర్డ్ చేసింది. శాంటో (124) మరోసారి శతకంతో విరుచుకుపడ్డాడు. మోమినుల్ హక్ (121) కూడా సెంచరీ బాదేశాడు. 662 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ 115 పరుగులకే చేతులెత్తేసింది. తస్కిన్ అహ్మద్ (4/37), షారిఫుల్ ఇస్లాం (3/28) ఆఫ్గాన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో టెస్టు చరిత్రలో మూడో అతిపెద్ద విజయాన్ని బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది.