BAN vs NED: వరల్డ్కప్లో సంచలన విజయం.. బంగ్లాదేశ్ను చిత్తు చేస్తూ
X
ఈ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ జట్టు సంచలనాలకు కేరాఫ్ గా మారింది. అద్భుత ఆట తీరుతో హేమాహేమీ జట్లను మట్టి కరిపిస్తుంది. ప్రతీ టీంకు గట్టి పోటీ ఇస్తూ.. తామేం తక్కువ కాదని రుజువు చేస్తుంది. ఈ క్రమంలో కోల్ కతా లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మరో సంచలనాన్ని నమోదు చేసింది. 87 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ ఎడ్వర్డ్స్ (68), బర్రెసి (41), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35) రాణించారు. బంగ్లా బౌలర్లు ఇస్లామ్, తస్కిన్, ముస్తాఫిజుర్, మెహది హసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. షకిబల్ హసన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
నెదర్లాండ్స్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడబడింది. 25 ఓవర్లలో 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ఏ దశలోనూ బంగ్లా కోలుకోలేకపోయింది. బంగ్లా బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. లిటన్ దాస్ (3), హసన్ (15), మెహిదీ (35), షాంటో (9), షకీబ్ (5), ముస్తాఫిజుర్ రహిమ్ (1) ఫెయిల్ అయ్యారు. చివర్లో మహ్మదుల్లా (20), మెహదీ హసన్ (17), ముస్తాఫిజుర్ (20) కాసేపు ఆశలు రేకెత్తించినా ఓటమి తప్పలేదు. దీంతో నెదర్లాండ్స్ వరల్డ్ కప్ లో మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కోలిన్ అకెర్మాన్ 1, బాస్ డి లీడే 2, లోగాన్ వాన్ బీక్ 1, ఆర్యన్ దత్ 1 వికెట్లు తీసుకున్నారు. పాల్ వాన్ మీకర్ 4 వికెట్లతో సత్తా చాటాడు.