ICC World Cup 2023: బీసీసీఐ ఆనవాయితీ.. అవసరానికి వాడుకుంటారు, వరల్డ్కప్ అనగానే పక్కన పడేస్తారు
X
మరో రెండు వారాల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. స్వదేశంలో జరిగే టోర్నీకోసం స్టేడియాలన్నీ ముస్తాబవుతున్నాయి. కోచ్లు, కెప్టెన్లు వ్యూహాలు రచిస్తున్నారు. ఆటగాళ్లు సిద్ధం అవుతున్నారు. ఇదంతా జరిగేదే. కానీ, ప్లేయర్ల ఎంపిక విషయంలో ప్రతీసారి లాగే ఈసారి కూడా అన్యాయం జరిగిందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్న మాట. ఇక తెలుగు అభిమానులు ఎప్పటిలాగే నిరాశ చెందారు. తెలుగు వారిపై ఇంకా ఎన్నాళ్లీ వివక్ష, చిన్న చూపు అంటు ప్రశ్నిస్తున్నారు. అవసరానికి వాడుకుని తీరా మెగా టోర్నీలకు పక్కనబెట్టడం ఏంటని మండిపడుతున్నారు. మొన్న వీవీఎస్ లక్ష్మణ్, నిన్న అంబటి రాయుడు, ఇవాళ తిలక్ వర్మ.. కీలక ఆటగాళ్లైనా వాడుకుని పక్కన పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టోర్నీకి ముందు ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నా.. వాళ్లను కావాలనే సెలక్ట్ చేయకపోవడం అనేది తరతరాలుగా వస్తున్న బీసీసీఐ ఆనవాయితీ.
వీవీఎస్ లక్ష్మణ్.. భారత క్రికెట్ కు ఎంత సేవ చేశాడో తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో దిగ్గజంగా ఎదిగాడు. చాలామందికి మార్గదర్శలా మారాడు. అంత గొప్ప ఆటగాడు కూడా బీసీసీఐ నుంచి వివక్ష ఎదుర్కొన్నాడు. 2003 ప్రపంచకప్ కు ముందు లక్ష్మణ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టోర్నీకి ముందు ఆడిన ప్రతీ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. ఇక కచ్చితంగా వరల్డ్ కప్ కు సెలక్ట్ చేస్తారు అనుకున్న టైంలో.. అందరి ఊహను తలకిందులు చేస్తూ లక్ష్మణ్ కు మొండి చేయి చూపించారు. అప్పట్లో దీనిపై వివాదం చెలరేగింది. తెలుగు వాడనే కారణంతో కావాలనే సెలక్ట్ చేయలేదని విమర్శించారు.
2019 వరల్డ్ కప్ లో అంబటి రాయుడు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. బీసీసీఐ రాజకీయాలకు తన కెరీర్ బలయింది. 2019లో టీమిండియాలో మిడిల్ ఆర్డర్ స్లాట్ ఖాళీగా ఉంది. అప్పుడు రాయుడున్న ఫామ్, సీనియారిటీ వల్ల అంతా అతన్నే సెలక్ట్ చేస్తారు అనుకున్నారు. ఎవరూ ఊహించనట్లు సెలక్టర్స్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను సెలక్ట్ చేశారు. దాంతో నిస్సహాయంగా, కోపంలో రాయుడు సెలక్టర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ అప్పట్లో వైరల్ అయింది. ఇక టోర్నీ మధ్యలో విజయ్ గాయంతో వైదొలుగగా.. సెలక్టర్లను విమర్శించాడనే కారణంతో రాయుడుకు బదులు మరొకరిని సెలక్ట్ చేశారు. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన రాయుడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇప్పుడు తిలక్ వర్మ.. ఆసియా కప్, ఆ ముందు టోర్నీలకు సెలక్ట్ చేశారు. ఒకటి రెండు మ్యాచుల్లో తప్పా.. ఆడిన ప్రతీ మ్యాచ్ లో రాణించాడు. ఐపీఎల్ నుంచి మంచి ఫామ్ లో ఉన్నాడు. పార్ట్ టైం బౌలర్ గా కూడా పనికొస్తాడు. మిడిల్ ఆర్డర్ లో లెఫ్టార్మ్ బ్యాటర్ గా హిట్టింగ్ చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తేగల సమర్థుడు. ఇక స్వదేశంలో టోర్నీ కాబట్టి తప్పకుండా సెలక్ట్ చేస్తారు. రాణిస్తాడు అనుకున్నారంతా. కానీ తిలక్ వర్మ విషయంలో కూడా మొండి చేయి ఎదురైంది. వన్డేల్లో పెద్దగా రాణించని సూర్యకుమార్, గాయంతో ఉన్న శ్రేయస్ అయ్యర్ లకు ఛాన్స్ ఇచ్చారు. తిలక్ వర్మను పక్కనబెట్టారు. దీంతో తెలుగు క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష.. సబ్జెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. కావాలనే సెలక్ట్ చేయట్లేదని అభిమానులు మండి పడుతున్నారు. బీసీసీఐని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం విషయంలో అదే జరిగింది. కేవలం రెండు వార్మప్ మ్యాచ్ లు మినహా.. ఒక్క మెయిన్ మ్యాచ్ కు కూడా అవకాశం ఇవ్వలేదు.