Why Sarfaraz Khan not playing: సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. జట్టులోకి ఎంపికచేసి.. బెంచ్లో కూర్చోబెట్టడమేంటి
X
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో టీమిండియాకు దెబ్బమీద దెబ్బ తగులుతుంది. తొలి రెండు మ్యచ్ లకు విరాట్ దూరంగా కాగా.. గాయం కారణంగా కేఎల్ రాహుల్, జడేజా జట్టుకు దూరమయ్యారు. దీంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్ లను జట్టులోకి ఎంపిక చేసింది. చాలాకాలంగా దేశవాళీలో రాణిస్తున్నా.. సర్ఫరాజ్ ఖాన్ కు చోటు కల్పించట్లేదని అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. పుజారాను పక్కనబెట్టి మరీ వీరిని సెలక్ట్ చేసినా.. తుది జట్టులో మాత్రం చాన్స్ దక్కలేదు. దీంతో ఈ విషయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కావాలనే చాన్స్ ఇవ్వట్లేదని, శుభ్ మన్ గిల్ ఫెయిల్ అవుతున్నా అవకాశాలు కల్పించడంపై.. అభిమానుల్లో బీసీసీఐ వ్యతిరేకత ఎదురైంది. 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ పిచ్ లపై సమర్థంగా ఆడగలడు. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన తొలి అనధికార టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్ లో 96 పరుగులు చేశాడు. ఇక దేశావాళీ, రంజీ ట్రీఫీల్లో అతని ప్రదర్శన అద్భుతం. ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫామ్ లో ఉన్నవ్యక్తికి అవకాశాలు ఇవ్వకుండా.. అతన్ని మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని అంటున్నారు.
‘సర్ఫరాజ్ కు మరోసారి అన్యాయం జరిగింది. ఇంకెన్నాళ్లు అవకాశాలకోసం వెయిట్ చేయాలి. ఇంకా ఎలా ఆడితే తుది జట్టులో ఆడే అవకాశం కల్పిస్తారు. ఇన్నిరోజులు జట్టులోకి తీసుకోలేదు. ఇప్పుడు సెలక్ట్ చేసి.. ఆడించకపోవడం ఏంటి’ అని బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ప్రతీసారి ఇంత చర్చ జరుతున్నా.. ఏ మాజీ క్రికెటర్ సపోర్ట్ చేయకపోవడం, ఏ బీసీసీఐ అధికారి సమాధానం చెప్పకపోవడంలో ఉన్న అంతర్యం ఏంటని అభిమానులు మండిపడుతున్నారు. కాగా ఇవాళ్టి మ్యాచ్ లో రజత్ పటిదార్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.