Shoaib Bashir story : వేసిన రెండు బంతులతో కెరీర్ మలుపు.. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం.. ఎవరీ షోయబ్ బషీర్
X
(Shoaib Bashir story)విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ తరపున షోయబ్ బషీర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రంలోనే ఆకట్టుకున్న ఈ 20 ఏళ్ల షోయబ్ బషీర్ ఎంపిక వెనుక ఓ ఆసక్తికర నేపథ్యం ఉంది. ఆర నెలల క్రితం కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఆడిన తొలి మ్యాచ్ తోనే అందరి దృష్టిని ఆకర్శించాడు. ఆ మ్యాచ్ తోనే తన కెరీర్ ను మలుపు తిప్పుకున్నాడు. తన మొదటి ఓవర్.. తొలి రెండు బంతులే షోయబ్ బషీర్ ను ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చోటు దక్కేలా చేశాయి. చిత్రంగా అనిపించినా ఇదే నిజం. కాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 39 ఓవర్లు వేసిన బషీర్.. 3 కీలక వికట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు ఫ్యూచర్ స్పిన్నర్ గా మారాడు.
కౌంటీల్లో సోమర్ సెట్ తరపున ఎసెక్స్ పై అరంగేట్రం చేసిన బషీర్.. ఆ మ్యాచ్లో 49 ఓవర్లు వేసినా ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. కానీ బషీర్ వేసిన తొలి ఓవరే.. తన కెరీర్ ను మలుపు తిప్పింది. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు అలిస్టెర్ కుక్ కు.. ఓ మ్యాచ్ లో బషీర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ లోని తొలి రెండు బంతులకు ఫిదా అయిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. పట్టుబట్టి భారత సిరీస్ కు జట్టులో చోటిచ్చాడు. టెస్ట్ క్రికెట్ లో అపార అనుభవం ఉన్న కుక్ కూడా.. బషీర్ వేసిన ఆ రెండు బంతులకు తడబడ్డాడు. అతని బౌలింగ్ లో బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు కుక్.
దీంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ బషీర్ ప్రతిభను గుర్తించి.. ఆ రెండు బంతుల వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు పంపించాడు. ఆ వీడియో చూసిన ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్, ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ కూడా బషీర్ బౌలింగ్ కు ఆకర్షితులయ్యారు. దీంతో భారత పర్యటనకు అతన్ని సెలక్ట్ చేశారు. ఈ విషయం మాట్లాడిన బెన్ స్టోక్స్.. ట్విట్టర్ లో బషీర్ బౌలింగ్ చేస్తున్న వీడియో చూశా. అప్పుడే అతను ఫ్యూచర్ స్టార్ అవుతాడనిపించింది. ఆ వీడియో క్లిప్ ను ఇంగ్లాండ్ బోర్డుకు పంపించా. భారత పర్యటనలో బషీర్ కచ్చితంగా పనికొస్తాడని వారిని ఒప్పించా. ఫలితంగా 3 కీలక వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చాడు.