నా రికార్డులు బద్దలుకొట్టే సత్తా కోహ్లీకి లేదు: బ్రియాన్ లారా
X
విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో మేటి ఆటగాడిగా ఎదిగాడు. దిగ్గజాల రికార్డులను సైతం బద్దలుకొట్టాడు. తాజాగా ఎవరీ సాధ్యం కాదనుకున్న సచిన్ టెండూల్కర్ రికార్డును సైతం చెరిపేశాడు. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో కోహ్లీ 50 సెంచరీలు సాధించి చరిత్రకెక్కాడు. కాగా ప్రపంచంలో విరాట్ కోహ్లీని మెచ్చుకోని దిగ్గజ క్రికెటర్ లేడు. అయితే తాజాగా ఆనంద్ బజార్ పత్రిక మీడియా సంస్థతో మాట్లాడిన బ్రయాన్ లారా తన రికార్డుల విషయాన్ని ప్రస్తావించాడు. తన రికార్డులు బద్దులుకొట్టే సత్తా విరాట్ కోహ్లీకి లేదని చెప్పుకొచ్చాడు. కాగా బ్రియాన్ లారా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, దేశవాళీ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2003-2004లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ లో పర్యటించిన టైంలో నాలుగో టెస్టులో ఓ ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేశాడు. 1994లో ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడిన లారా.. వార్విక్ షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ డుర్హామ్ జట్టుపై 501 పరుగులు చేశాడు.
కాగా ఈ రికార్డులను విరాట్ కోహ్లీ ఎప్పటికీ బద్దలు కొట్టలేదని లారా తేల్చిచెప్పాడు. అయితే ఈ రికార్డులు బ్రేక్ చేయగల సమర్థులు శుభ్ మన్ గిల్ అని లారా చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ క్రికెట్ ను గిల్ చాలాకాలం ఏలే అవకాశం ఉంది. గిల్ కౌంటీ క్రికెట్ ఆడితే.. నా 501 పరుగుల రికార్డ్ తప్పక బద్దలు కొడతాడు. టెస్టుల్లో 400 పరుగుల రికార్డు చెరిపేస్తాడు. నా మాటలు గుర్తుపెట్టుకోండి’ అని చెప్పుకొచ్చాడు.