Home > క్రీడలు > సహారా నుంచి డ్రీమ్ 11 వరకు.. చిక్కుల్లో టీమిండియా జెర్సీ స్పాన్సర్స్

సహారా నుంచి డ్రీమ్ 11 వరకు.. చిక్కుల్లో టీమిండియా జెర్సీ స్పాన్సర్స్

సహారా నుంచి డ్రీమ్ 11 వరకు.. చిక్కుల్లో టీమిండియా జెర్సీ స్పాన్సర్స్
X

"ప్రపంచ కప్ 2023 మరో వారంలో షురూ కానుంది." (World cup 2023) అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ముందే టీమ్ ఇండియా సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం టీమిండియా కొత్త జెర్సీ ప్రధాన స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్‌ లీగ్‌ కంపెనీ ‘డ్రీమ్‌11’ ఎంపికైంది. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్‌’ ఉంది. గత ఏప్రిల్‌తో బైజూస్‌ ఒప్పందం ముగిసింది. గతంలో స్టార్, ఒప్పో, సహారా సంస్థలు టీమిండియా జెర్సీకి స్పాన్సర్ గా ఉన్నాయి. అయితే విచిత్రంగా... భారత జట్టుకి స్పాన్సర్ చేసిన సదరు సంస్థలంతా వివాదాల్లోనో, లేదంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు చిక్కుకోవడం విశేషం.

సహారా గ్రూప్.. గతంలో భారత జట్టు జెర్సీపై ఉన్న లోగోతో ఈ సంస్థ క్రికెట్ అభిమానులకే కాదు.. దేశం మొత్తం కూడా పాపులర్ అయింది. సహారా ఇండియా పరివార్ సుబ్రతా రాయ్ చైర్మన్. ఒకప్పుడు టీమిండియా స్పాన్సరర్ గా ఉన్న సహారా.. రెండు దశాబ్దాల కిందట చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లను నిలువునా ముంచిందని ఆరోపణలు వచ్చాయి. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో దాదాపు 3 కోట్ల మంది నుంచి రూ. 24,000 కోట్లకు పైగా వసూలు చేసి చివరకు చేతులెత్తేసింది. ఈ పరిణామాలతో కంపెనీ ఐపీ పెట్టింది. సహారాలో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ... డబ్బు రిఫండ్ చేసుకునేందుకు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. 1978లో సహారా ఇండియా పరివార్‌ను స్థాపించిన సుబ్రతా రాయ్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు.

ఆ తర్వాత చైనా సంస్థ ఒప్పో కూడా జెర్సీ విషయంలో తీవ్రంగా నష్టపోయింది. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేయడం కోసం చైనా సంస్థతో బీసీసీఐ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ(స్వదేశీ జాగరణ్ మంచ్) డిమాండ్ చేసింది. ఎంతలా అంటే.. జెర్సీ మీదున్న ఓప్పో లోగో వల్ల.. చైనీస్ బ్రాండ్‌లను కొనుగోలు చేసేలా దేశ యువతను తప్పుదారి పట్టిస్తోందంటూ.. ఈ ప్రచారం వల్ల దేశ యువత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ క్రీడా మంత్రి విజయ్ గోయల్‌కు లేఖ కూడా రాసింది. ఫలితంగా ఒప్పో నష్టాలను ఎదుర్కొంది.

"టీమిండియాను సపోర్ట్ చేసిన స్టార్ గ్రూప్కు కూడా బీసీసీఐ మీడియా హక్కుల విషయంలో గట్టి షాక్ తగిలింది". రిలయన్స్ ఆధ్వర్యంలోని వయాకామ్ 18... 2023-2028 కాలానికి బీసీసీఐ మీడియా హక్కులను భారీ రేటుకు కైవసం చేసుకుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో టీమిండియా ఆడే హోం మ్యాచ్‌లను వయాకామ్ 18 మాత్రమే ప్రసారం చేయనుంది. డిజిటల్, టెలివిజన్ రెండింటికీ సంబంధించిన బ్రాడ్‌కాస్ట్ హక్కులను ఈ సంస్థే తన ఖాతాలో వేసుకుంది. దీంతో సొంతగడ్డపై టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ స్పోర్ట్ 18, స్పోర్ట్ 18 ఖేల్ ఛానళ్లలో మాత్రమే ప్రసారం అవుతాయి. డిజిటల్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమాలో వస్తాయి. ఇది స్టార్ గ్రూప్‌కు గట్టి దెబ్బే.

ఇండియన్ టీం మరో స్పాన్సర్ బైజూస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న ఈ ఎడ్యు-టెక్‌ స్టార్టప్‌ ఈ ఏడాదిలో ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. నిర్వహణను మెరుగుపరచుకోవాలని ఇచ్చిన సలహాలను యాజమాన్యం పెడచెవిన పెట్టనందుకే ఈ పరిస్థితి దాపురించిన్న వాదనలు ఉన్నాయి. ఈ సంస్థ వ్యాపార, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడంతో భాగంగా గత నెలలో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రత్యూష అగర్వాల్‌, ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ రాజీనామా చేశారు.

టీమిండియా ప్రస్తుత స్పాన్సర్ డ్రీమ్ 11 కూడా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీకి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (DGGI) ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌పై (Online Gaming) జీఎస్టీని 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన నేపథ్యంలో.. డ్రీమ్ 11 రూ. 40వేల కోట్లు జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డీజీజీఐ తన నోటీసుల్లో పేర్కొనడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. గతేడాది బెంగళూరుకు చెందిన గేమ్స్‌ క్రాఫ్ట్‌ టెక్నాలజీకి రూ.21వేల కోట్ల ట్యాక్స్‌ నోటీసు పంపించారు. దేశ పరోక్ష పన్నుల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మొత్తం బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపడం ఇదే తొలిసారి.

Updated : 27 Sept 2023 11:57 AM IST
Tags:    
Next Story
Share it
Top