ఐపీఎల్ ఆడని ఆ ముగ్గరు క్రికెటర్లకు రివార్డ్..
X
ఐపీఎల్ ఆడాలని ప్రతి క్రికెటర్ కల. ఐపీఎల్‌లో రాణిస్తే కోట్లు కొల్లగొట్టడంతో పాటు..ప్రపంచానికి మొత్తం ఇట్టే తెలిసిపోవచ్చు. అందుకే ఈ రిచ్ క్యాష్ లీగ్‌లో ఆడేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఆశపడుతుంటారు. పలు సందర్భాల్లో జాతీయ జట్టు కన్నా ఐపీఎల్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లున్నారంటే ఈ లీగ్ క్రేజ్ ఏంటో చెప్పక్కర్లేదు. అట్లాంటి ఐపీఎల్‌ను బంగ్లాదేశ్ క్రికెటర్స్ షకీబ్ అల్‌హసన్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్‌లు ఈ ఏడాది తిరస్కరించారు. తమకు డబ్బులు కంటే దేశమే ముఖ్యమన్నారు. దీంతో వారికి బంగ్లాదేశ్ బోర్డు రివార్దు ప్రకటించింది.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రూ.1.5 కోట్లకు కోల్‌తా నైట్ రైడర్స్ దక్కించుకుంది. కానీ ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా షకీబ్ ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇక లిటన్ దాస్ రూ.50 లక్షలకు కోల్‌కతా జట్టే కొనుగోలు చేసింది. అతడు కూడా ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఐపీఎల్ ఫస్టాఫ్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రెండో దశలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. ఐపీఎల్ సగభాగంలో లఖ్‌నవూ తరఫున తస్కిన్ అహ్మద్ ఆడే అవకాశం వచ్చినా బంగ్లా క్రికెట్ బోర్డు సూచన మేరకు అతడు ఐపీఎల్‌లో భాగం కాలేదు.
దేశం కోసం ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఈ ముగ్గురు క్రికెటర్లను బంగాదేశ్ ప్రశంసించింది. వారికి నగదు పురుస్కారం ఇవ్వాలని భావించింది. షకీబ్ అల్‌హసన్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్‌లకు కలిపి 65 వేల డాలర్లను(దాదాపు 53 లక్షలు) బీసీబీ నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్ దృష్ట్యా ఆస్ట్రేలియాకు చెందిన పలువురు కీలక ప్లేయర్స్ ఐపీఎల్‌లో ఆడలేదు.