Home > క్రికెట్ > టీమిండియాకు ఘోర పరాభవం.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి

టీమిండియాకు ఘోర పరాభవం.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి

టీమిండియాకు ఘోర పరాభవం.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి
X

బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌ ను 2-1తో గెలిచిన టీమిండియా..మూడు వన్డేల సిరీస్ ను మాత్రం ఓటమితో ప్రారంభించింది. ఢాకా వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్‌పై బంగ్లాదేశ్‌ 40 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి) విజయం సాధించింది. వన్డేల్లో టీమిండియాపై ఇదే మొదటి గెలుపు కావడం విశేషం.





వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 152 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు అమన్‌జోత్‌ కౌర్‌ (4/31), దేవిక వైద్య (2/36), దీప్తి శర్మ (1/26) ధాటికి తక్కవ స్కోరుకే పరిమితమైంది. బంగ్లా బ్యాటింగ్‌లో 39 పరుగులు చేసిన నిగార్‌ సుల్తానా టాప్‌ స్కోరర్‌.

ఫర్జానా హక్‌ 27 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.




స్వల్ప లక్ష్యంతో చేధన ప్రారంభించిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతీ మంధాన (11) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరింది. ఆతర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో టీమ్‌ఇండియా ఓటమి ఖరారు అయిపోయింది. చివరికి భారత్ 35.5 ఓవర్లలోనే 113 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (20) టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం. బంగ్లా బౌలర్ మరుఫా అక్తర్ (4/29), రెబయా ఖాన్ (3/30) భారత్‌ పతనాన్ని శాసించారు.

ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జులై 19న ఢాకా వేదికగా జరుగనుంది.


Updated : 16 July 2023 9:09 PM IST
Tags:    
Next Story
Share it
Top