ఎమర్జింగ్ ఆసియా కప్ - 2023..పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి
X
ఎమర్జింగ్ ఆసియా కప్ - 2023 విజేతగా పాక్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. దాయాది జట్టుపై 128 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. పాకిస్తాన్ అందించిన 353 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 40 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. భారీ లక్ష్యాన్ని చూసి ఒత్తిడికి లోనైన యువ ఆగటాళ్లు త్వరగా వికెట్లను సమర్పించుకున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (51 బంతుల్లో 61) రాణించాడు. కెప్టెన్ యశ్ ధుల్ 39, సాయి సుదర్శన్ 29 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో మ్యాచ్ వన్ సైడ్‌గా మారిపోయింది.
అంతకుముందు భారత్ బౌలర్లు తేలిపోవడంతో..టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది. పాక్ బ్యాటర్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. సాహిమ్ ఆయుబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. కీలకమైన చివరి పోరులు భారత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పేసర్లు, స్పిన్నర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్, రాజవర్దన్ హంగార్గెకర్ చెరో రెండు వికెట్లు తీశారు.