Home > క్రికెట్ > WTC ఫైనల్ ఓటమికి ఐపీఎల్ కారణమా..?

WTC ఫైనల్ ఓటమికి ఐపీఎల్ కారణమా..?

WTC ఫైనల్ ఓటమికి ఐపీఎల్ కారణమా..?
X

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా తీవ్ర నిరాశపర్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఔట్ చేయలేక..వారి బౌలర్లను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫి తర్వాత మరో ఐసీపీ ట్రోఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత్ అభిమానులు మరోసారి నిరుత్సాహానికి గురయ్యారు. భారత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆసీస్.. WTC టైటిల్ మొదటి సారి దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇక భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం ఐపీఎల్ అనే చర్చ మొదలైంది. ఐపీఎల్ కారణంగానే ఐసీసీ టోర్నీల్లో టీమిండియా రాణించడం లేదని వాదన బలంగా వినిపిస్తోంది.




ఐపీఎల్ కొంపముంచిందా..?




టీ20, టెస్ట్ క్రికెట్.. రెండు డిఫరెంట్ ఫార్మెట్లు. టీ20 ధనాధన్ ఆట కాగా..టెస్ట్ క్రికెట్ ఐదురోజులు పాటు సుదీర్ఘంగా సాగే గేమ్. రెండింటికి అసలు పోలీక ఉండదు. టీ20 ఆటకు అలవాటు పడిన ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌లో క్రీజ్‌లో నిలదొక్కుకునేందు ఇబ్బంది పడతారు. ఇదంతా తెలిసినా బీసీసీఐ కీలకమైన WTC ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ టోర్నీని రెండు నెలల పాటు నిర్వహించింది. ఐపీఎల్ ముగిసినా వెంటనే ఏ మాత్రం తీరిక లేకుండా టెస్ట్ ఫైనల్ మ్యాచ్ కు భారత్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. కనీసం వారికి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. అదే విధంగా ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలు బారిన పడ్డారు. WTC ఫైనల్‌కు సమయం లేకపోవడంతో వారు తిరిగి కోలుకుని జట్టులో చేరే అవకాశం లేకుండా పోయింది. టీమిండియా అవసరాల కోసం ప్లేయర్లు అవసరమైతే ఐపీఎల్‍కు దూరంగా ఉండాలని మాజీల సూచనలు కనీసం ఎవరూ పాటించలేదు. కీలక ప్లేయర్స్ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే ఆడతారని..రొటేషన్ పద్దతి పాటిస్తారని మాటలు చెప్పినా అవి అమలు కాలేదు. ఫ్రాంఛైజీలు కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఆడేశారు. ఆస్ట్రేలియా జట్టులోని చాలామంది ఆటగాళ్లు మాత్రం చాలా ఫ్రెష్‌గా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు వచ్చి సత్తా చాటారు. దీంతో దేశ ప్రయోజనాల కంటే డబ్బులకే బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




ఐపీఎల్ హీరోస్..ఇక్కడ జీరోస్..




ఐపీఎల్ అంటే భారత్ ఆటగాళ్లు రెచ్చిపోతారు. స్వదేశీ పిచ్‌లపై వీర విహారం చేసి.. వరుస సెంచరీలు బాదేస్తారు. ఐపీఎల్‌లో అదరగొట్టినా..టీమిండియా తరఫునా మాత్రం తేలిపోతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఇదే జరిగింది. రెండు నెలల ఐపీఎల్ పుణ్యమా అని టీ20 ఆటకు ఆలవాటు పడిన భారత్ స్టార్ క్రికెటర్స్ చెత్త షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. పొట్టి ఫార్మెట్ నుంచి సుదీర్ఘ ఫార్మెట్‌కు తమను మలుచుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఒక్క రహానె తప్ప మిగిలిన ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ఐపీఎల్‌లో 4 ఓవర్లు వేసి సేదతీరిన భారత్స్ బౌలర్స్ కూడా WTC ఫైనల్‌లో తేలిపోయారు.




వరుసగా 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి..

ధోని కెప్టెన్సీలో 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫి నెగ్గిన టీమ్ ఇండియా..తర్వాత ICC ట్రోఫీ కలగానే మిగిలిపోయింది. కొన్ని సార్లు సాధించే అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయింది. ICC ప్రధాన టోర్నీల్లో ఫైనల్‌కు వెళ్లి ఓటమి చవిచూడడం పరిపాటిగా మారింది. డబ్ల్యుటిసి ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ తాజా ఓటమితో వరుసుగా నాలుగు ICC ఫైనల్స్‌లో ఓడిన జట్టుగా నిలిచింది. 2014 T20 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021,2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది.






Updated : 11 Jun 2023 3:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top