టీంలో అతనిది ప్రత్యేక స్థానం.. ఫామ్లోకి వస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే: కపిల్ దేవ్
X
వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలయింది. ఈ సంగ్రామానికి ఇంకా వందరోజులు టైం ఉంది. దాంతో ప్రతి జట్టు తమ ఆటగాళ్లను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాయి. టీమిండియా కూడా వరల్డ్ కప్ కు ముందు కీలక వెస్టిండీస్, ఆసియా కప్, ఐర్లాండ్ సిరీస్ లు ఆడనుంది. జట్టును బలంగా తయారుచేయడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కీలక ఆటగాళ్ల పరిస్థితి జట్టుకు పెద్ద తల నొప్పిగా మారింది. ఇప్పటికే కేఎల్ రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్.. గాయాల బారిన పడి జట్టుకు దాదాపు దూరం అయ్యారు. వాళ్లు ఎప్పుడు కోలుకుంటారు..? తిరిగి ఫామ్ అందుకుని జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. వాళ్ల గైర్హాజరు జట్టుకు లోటనే చెప్పొచ్చు. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. ఓ ఆటగాడి ఫామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా పాత్ర కీలకం కానుంది. అతను జట్టుకు బలంగా మారే అవకాశం లేకపోలేదు. కానీ, అతని గురించి నాకు ఆందోళన కలుగుతుంది. హార్దిక్ చాలా తొందరగా గాయాల బారిన పడతాడు. తిరిగి కోలుకోడానికి టైం తీసుకుంటాడు. ఇప్పడిప్పుడే అతను తిరిగి ఫామ్ అందుకుంటున్నాడు. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత చాలా ఉంది. ప్రస్తుతం టీం బలంగానే కనిపిస్తుంది. గాయాల బారిన పడ్డవాళ్లు కూడా ఉండుంటే చాలా బాగుండేది. హార్దిక్ ఫిట్ గా ఉండి, రాణిస్తే.. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తాడు. ఆల్ రౌండర్ గా అతని ఇంపాక్ట్ జట్టుకు అవసరం. వరల్డ్ కప్ కోసం ప్రతి ఆటగాడు సిద్ధంగా ఉండాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓపెనర్లుగా రోహిత్, గిల్.. మూడో వికెట్లో విరాట్, తర్వాత కేఎల్.. ఇలా జట్టంతా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ, వరల్డ్ కప్ కు ముందు మరిన్ని వన్డేలు ఆడాలి. ప్రాక్టీస్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని’ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.